శాంసన్‌ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా? | Will Sanju Samson Fate Change In This IPL | Sakshi
Sakshi News home page

శాంసన్‌ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?

Published Thu, Oct 8 2020 2:51 PM | Last Updated on Thu, Oct 8 2020 4:40 PM

Will Sanju Samson Fate Change In This IPL - Sakshi

దుబాయ్‌:  సంజూ శాంసన్‌..ఈ ఐపీఎల్‌ ఆరంభంలో మార్మోగిన పేరు. ఒక్కసారిగా లీగ్‌కు ఊపు తేవడమే కాకుండా రాజస్తాన్‌కు వరుసగా రెండు విజయాలను అందించాడు. ఫలితంగా అంతవరకూ రేసులో లేని రాజస్తాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు కారణం సంజూ శాంసన్‌ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లే కారణం.  అదే సమయంలో భారత జట్టులో శాంసన్‌ మళ్లీ చోటు సంపాదించడం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. అటు బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపర్‌గానూ మంచి టాలెంట్‌ ఉన్న సంజూ శాంసన్‌కు పోటీనే లేదనే పలువురు అభిప్రాయపడ్డారు.  (చదవండి:ఇలా అయితే కష్టం పృథ్వీషా!)

సంజూ శాంసన్ కొత్తగా కనిపిస్తున్నాడని, త్వరలోనే ఎంఎస్‌ ధోని వారసుడిగా భారత జట్టులోకి వస్తాడని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై తానేమి మారలేదని చెప్పకనే చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించిన శాంసన్.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో కలిపి 12 పరుగులే చేశాడు. ఫలితంగా రాజస్తాన్‌ హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది. ఇక్కడ రాజస్తాన్‌ పరిస్థితి ఒకటైతే, సంజూ శాంసన్‌ పరిస్థితి ఇంకా చిత్రంగా మారింది. పొగిడినోళ్లే ఆ షాట్‌ సెలక్షన్‌ ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు.

శాంసన్‌కు ఇది కొత్తకాదు..
ఐపీఎల్‌లో శాంసన్‌కు ఇది కొత్త కాదు. గత రెండు సీజన్లలో కూడా ఇలాంటి ప్రదర్శననే కనబర్చాడు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్ ఆడటం తర్వాత ఊసే లేకుండా పోవడం అతనికి పరిపాటిగా మారిపోయింది.  గతేడాది జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనే భారీ సెంచరీతో చెలరేగిపోయాడు శాంసన్‌.  ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయంగా 102 పరగులు చేశాడు. ఈ సీజన్‌ మాదిరిగానే అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత పది మ్యాచ్‌ల్లో ఒక్క అర్థ శతంక కూడా శాంసన్‌ ఖాతాలోకి రాలేదు. ఆ పది మ్యాచ్‌ల్లో 8,6, 31, 27, 35, 0, 22, 48 నాటౌట్‌, 28, 5లు నమోదు చేశాడు.  

ఎంతో టాలెంటెడ్‌ క్రికెటర్‌ అని చెప్పుకుంటున్న శాంసన్‌కు నిలకడలేమే అతి పెద్ద సమస్య. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. కానీ ఇలోపే పిచ్‌పై సరిగా అంచనాకు రాకుండానే భారీ షాట్లకు వెళ్లి మూల్యం చెల్లించుకుంటున్నాడు. దాన్ని శాంసన్‌ మార్చుకోవాల్సింది షాట్‌ సెలక్షన్‌. ప్రతీ బంతిని హిట్‌ చేయాలనే ఆలోచన. బంతిపై కచ్చితమైన అవగాహన అలవర్చుకోవాలి. లేని పక్షంలో శాంసన్‌కు పాత కథే పునరావృతమైన ఆశ్చర్యం లేదు. భారత్‌ తరఫున కేవలం నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడిన శాంసన్‌.. 35 పరుగులే చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శాంసన్‌ ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించాడనే లోపే పెవిలియన్‌కు చేరిపోయాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఓవర్‌పిచ్‌ బాల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. షాట్‌ ఆడబోయి చాలా ఈజీ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఆ మ్యాచ్‌లో శాంసన్‌ ఐదు బంతులాడి 2 పరుగులే చేశాడు. టాలెంట్‌ ఉండి కూడా అతనే  ఆవేశమే అవకాశాలు రాకుండా చేస్తోందనేది నిజం.

అన్ని గ్రౌండ్లు షార్జా కాదు..
ఈ ఐపీఎల్‌లో శాంసన్‌ ఆడి రాజస్తాన్‌ గెలిచిన రెండు మ్యాచ్‌లో షార్జాలోనే.. సీఎస్‌కేతో రాజస్తాన్‌ ఆడిన తన తొలి మ్యాచ్‌లో 216 పరుగులు చేసింది. అందులో 74 పరుగులు చేశాడు. 32 బంతుల్లో  1 ఫోర్‌, 9 సిక్స్‌లు కొట్టాడు. ఆపై కింగ్స్‌ పంజాబ్‌తో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో  224 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ ఛేదించి గెలిచింది. ఇందులో కూడా శాంసన్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌. ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు 85 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిక్స్‌లను సునాయాసంగా కొట్టే శాంసన్‌..పిచ్‌ను, ఆడే గ్రౌండ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాడు. ప్రతీది బ్యాటింగ్‌ పిచ్‌ అనుకోకుండా బౌండరీ లైన్‌ దూరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతీది షార్జాలాంటి చిన్న గ్రౌండ్‌ అనుకుంటే ఇలానే జరుగుతుంది. దుబాయ్‌, అబుదాబిలు బౌండరీ లైన్‌ దూరం పెద్దది అనే విషయం కూడా శాంసన్‌కు సోయిలో లేకుండా పోయినట్లుంది. మరి ఇకనైనా పిచ్‌, గ్రౌండ్‌ పరిస్థితిని అంచనా వేసుకుని ఆడతాడో లేదో అనేది చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement