ప్రిక్వార్టర్స్‌లో సానియా–బోపన్న జంట | Wimbledon 2021: Sania Mirza And Rohan Bopanna Enters Third Round | Sakshi
Sakshi News home page

Wimbledon 2021: ప్రిక్వార్టర్స్‌లో సానియా–బోపన్న జంట

Published Sun, Jul 4 2021 8:45 PM | Last Updated on Sun, Jul 4 2021 11:58 PM

Wimbledon 2021: Sania Mirza And Rohan Bopanna Enters Third Round - Sakshi

లండన్‌: నాలుగేళ్ల విరామం తర్వాత వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన సానియా మీర్జా మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్‌కే చెందిన రోహన్‌ బోపన్నతో జతకట్టిన సానియా మీర్జా భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో 6–3, 6–1తో ఐడన్‌ మెక్‌హగ్‌–ఎమిలీ వెబ్లీస్మిత్‌ (బ్రిటన్‌) జోడీపై విజయం సాధించింది. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీ స్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌)–ఆండ్రియా క్లెపాక్‌ (స్లొవేనియా)లతో సానియా–బోపన్న ఆడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భార్యాభర్తలైన దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–సమంత ముర్రే శరణ్‌ (బ్రిటన్‌) జోడీ 6–3, 6–7 (1/7), 3–6తో రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా)–దరియా జురాక్‌ (క్రొయేషియా) జంట చేతిలో ఓడింది.

మెద్వెదేవ్‌ తొలిసారి... 
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) అద్భుత పోరాటపటిమ కనబరిచి గట్టెక్కాడు. మూడో రౌండ్‌లో మెద్వెదేవ్‌ 6–7 (3/7), 3–6, 6–3, 6–3, 6–2తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గి ఈ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్‌ 3 గంటల 36 నిమిషాల్లో గెలుపొందాడు. తొలి రెండు సెట్‌లు చేజార్చుకున్నాక మెద్వెదేవ్‌ కోలుకున్నాడు. వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 16 ఏస్‌లు సంధించిన మెద్వెదేవ్‌ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేశాడు.  

బార్టీ ముందంజ... 
మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్, వరల్డ్‌ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్‌లో బార్టీ 6–3, 7–5తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచింది. గంటా 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం నుంచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. మంగళవారం నుంచి జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల నుంచి వంద శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నట్లు... ఈ మేరకు ఇంగ్లండ్‌ ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు కేవలం పురుషుల, మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లకే వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement