చాంపియన్‌కు షాక్ | Defending women's champion Petra Kvitova crashes out of .. | Sakshi
Sakshi News home page

చాంపియన్‌కు షాక్

Published Sun, Jul 5 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

జంకోవిచ్ సంబరం

జంకోవిచ్ సంబరం

జంకోవిచ్ చేతిలో క్విటోవా ఓటమి
 ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, ట్రోస్కీ, వోజ్నియాకి, సిలిచ్
 సోంగా, కెర్బర్‌కు చుక్కెదురు

 
 లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్ పెట్రా క్విటోవా మూడోరౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో 28వ సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా) 3-6, 7-5, 6-4తో రెండోసీడ్ క్విటోవా (చెక్)పై సంచలన విజయం సాధించింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్ కోల్పోయిన జంకోవిచ్ చివరి రెండు సెట్లలో అద్భుతమైన పోరాటం చేసింది.
 
లభించిన ఒక్క బ్రేక్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సర్వీస్‌ను నిలబెట్టుకుని క్విటోవా తొలిసెట్‌ను దక్కించుకుంది. రెండోసెట్ ఆరంభంలోనూ సెర్బియన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి క్విటోవా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకున్నా.... ఏడో గేమ్‌లో జంకోవిచ్ రెండు బ్రేక్ పాయింట్లను కాచుకుంది. ఎనిమిదో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో స్కోరు 4-4తో సమమైంది.
 
 మళ్లీ 12వ గేమ్‌లో చెక్ ప్లేయర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడోసెట్‌లో తొమ్మిది గేమ్‌ల వరకు ఇరువురు హోరాహోరీగా పోరాడారు. అయితే స్కోరు 5-4 ఉన్న దశలో క్విటోవా సర్వీస్‌ను కోల్పోవడంతో జంకోవిచ్ విజేతగా నిలిచింది.

ఇతర మ్యాచ్‌ల్లో 5వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-2, 6-2తో 31వ సీడ్ కెమిల్లా గియోర్జి (ఇటలీ)పై; 13వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-1, 6-4తో డెల్లాక్వా (అమెరికా)పై; 15వ సీడ్ బాసిన్‌స్కి (స్విట్జర్లాండ్) 6-3, 6-2తో 18వ సీడ్ లిసికి (జర్మనీ)పై; 20వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 7-6 (12), 1-6, 6-2తో 10వ సీడ్ కెర్బర్ (జర్మనీ)పై; 21వ సీడ్ కీస్ (అమెరికా) 6-4, 6-4తో తట్జానా మరియా (జర్మనీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.

సోంగాకు షాక్
 పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జో విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)కు చుక్కెదురైంది. 23వ సీడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) 7-6 (3), 4-6, 7-6 (2), 7-6 (9)తో సోంగాపై నెగ్గాడు.
 
 ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-4, 6-7 (5), 6-2తో సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)పై; 9వ సీడ్ మార్లిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-6 (4), 6-7 (6), 6-4, 6-7 (4), 12-10తో 17వ సీడ్ ఇస్నేర్ (అమెరికా)పై; 20వ సీడ్ అగుట్ (స్పెయిన్) 7-6 (4), 6-0, 6-1తో బాసిలాషివిల్లి (జార్జియా)పై; 22వ సీడ్ ట్రోస్కీ (సెర్బియా) 6-4, 7-6 (3), 4-6, 6-3తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

 ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి
మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి 6-0, 6-1తో డేట్ క్రుమ్న్ (జపాన్)-షియావోన్ (ఇటలీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
 
మిక్స్‌డ్‌లోనూ సానియా-సోరెస్ (బ్రెజిల్) 6-2, 6-4తో బెగ్‌మెన్ (జర్మనీ)-హుసరోవా (స్లోవేకియా)పై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో 11వ సీడ్ లియాండర్ పేస్-డానియెల్ నెస్టర్ (కెనడా) జోడి... 5-7, 7-6 (3), 7-6 (4), 7-5తో గబాష్‌విల్లీ (రష్యా)-యెన్ సున్ లూ (తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. బాలికల సింగిల్స్ తొలిరౌండ్‌లో 15వ సీడ్ ఎడ్లపల్లి ప్రాంజల 6-4, 6-2తో హెరాజో గోంజాలెజ్ (కొలంబియా)పై నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement