పాకిస్తాన్ క్రికెట్ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్‌లో బాగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మహిళల జట్టు కూడా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది.
అది కూడా మహిళల టి20 వరల్డ్‌కప్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రష్దా విలియమ్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారిలో క్యాంప్‌బెల్లె 23 పరుగులు, హేలీ మాథ్యూస్ 20 పరుగులు చేసింది.
అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ బ్యాటర్లలో అలియా రియాజ్ 29 పరుగులు, నిదా దార్ 27 పరుగులు, బిస్మా మరుఫ్ 26 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో మాథ్యూ 2 వికెట్లు తీయగా.. అరీ ఫ్లెచర్, కరీష్మా, షమీలా కనెల్‌లు తలా ఒక వికెట్ తీశారు.
పాక్ చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఆ ఓవర్‌లో ఒక వికెట్‌తో పాటు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఆ తర్వాతి ఓవర్ చినెల్లే కూడా సూపర్‌గా వేసింది. తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఆ తర్వాత ఐదు పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 2 బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. అయితే ఐదో బంతికి అలియా రియాజ్ ఔట్ కావడంతో మ్యాచ్ విండీస్ వైపు తిరిగింది. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగు మాత్రమే రావడంతో విండీస్ మూడు పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment