ఎదురే లేని ప్రదర్శనతో, ఓటమెరుగని జైత్రయాత్రతో కంగారూ సేన ఆరో సారి విశ్వ విజేతగా నిలిచింది. అన్ని రంగాల్లో రాణించిన ఆ్రస్టేలియా అమ్మాయిలు ఈ టి20 ప్రపంచకప్‌ను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ ‘తొలిసారి’ ఫైనల్ చేరిన మురిపెం రన్నరప్‌గానే ముగిసింది. సొంతగడ్డపై తమ మద్దతుదారుల మధ్య బౌలింగ్‌లో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా... బ్యాటింగ్ వైఫల్యంతో ప్రపంచకప్ కలను సాకారం చేసుకోలేకపోయింది.
కేప్‌టౌన్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మరో ‘హ్యాట్రిక్’తో టి20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్... 2016 మెగా ఈవెంట్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మళ్లీ 2018, 2020, 2023లలో ప్రపంచకప్‌ల హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో మెగ్ లానింగ్ సేన 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు అర్ధ సెంచరీ సాధించగా, ఆష్లే గార్డ్‌నర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడింది. సఫారీ బౌలర్లలో షబ్నెమ్ ఇస్మాయిల్ (2/26), మరిజన్ కాప్ (2/35) కంగా రు పెట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఓపెనర్ లారా వోల్‌వార్ట్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటం వృథా అయ్యింది. టోర్నీలో 110 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గార్డ్‌నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.
బెత్ మూనీ సూపర్ ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో గొప్ప మెరుపులేమీ లేవు. కానీ ఒక్క బ్యాటర్ మూనీ ఆ్రస్టేలియాను 20 ఓవర్ల పాటు నడిపించింది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్ఛిన ఆమె కడదాకా క్రీజులో నిలిచింది. పిచ్ నెమ్మదించిన సమయంలో... ప్రత్యర్థి సీమర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న తరుణంలో వికెట్‌ను కాపాడుకొని... కష్టమైనా సరే పరుగుల్ని సాధించిపెట్టింది.
మరో ఓపెనర్ అలీసా హీలీ (20 బంతుల్లో 18; 3 ఫోర్లు) పవర్ ప్లే వరకైనా నిలువలేదు. అయితే టాపార్డర్‌లో ఆష్లే గార్డ్‌నర్‌తో మూనీ భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌కు కీలకంగా మారింది. ఇద్దరు రెండో వికెట్‌కు 46 పరుగులే జత చేసినప్పటికీ... తర్వాత పిచ్ పరిస్థితుల దృష్ట్యా అదే మెరుగైన భాగస్వామ్యం అని చెప్పొచ్చు.
తర్వాత గ్రేస్ హారిస్ (10), కెపె్టన్ మెగ్ లానింగ్ (10), ఎలైస్ పెరీ (7), వేర్‌హమ్ (0) సులువుగానే దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పడిపోయారు. షబ్నెమ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని మూని 6, 4గా బాదింది. అయితే మూడో బంతికి ఒక్క పరుగు మాత్రమే రాగా... వరుస బంతుల్లో షబ్నెమ్ రెండు వికెట్లతో ఆసీస్‌ను కట్టడి చేసింది.
రాణించిన వోల్‌వార్ట్
సొంతగడ్డపై కాస్త కష్టపడితే ఛేదించే లక్ష్యమే ఎదురుగా ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ఆ పని చేయలేకపోయింది. ఆసీస్ చేసింది పెద్ద స్కోరేం కాకపోవడంతో బౌలర్లు తొలి ఓవర్‌నుంచే పట్టుబిగించారు. దీంతో తొలి 5 ఓవర్లలో సఫారీ వికెట్ నష్టానికి 17 పరుగులే చేసింది. ఓపెనర్ లారా వోల్‌వర్ట్ ధాటిగా ఆడటంతో కుదుట పడుతున్న దక్షిణాఫ్రికాకు మరో బ్యాటర్ సహకారం లేకపోవడంతో ప్రపంచకప్‌నే మూల్యంగా చెల్లించుకుంది.
టాపార్డర్‌లో బ్రిట్స్ (10), మరిజన్ కప్ (11) సహా, మిడిలార్డర్‌లో కెప్టెన్ సునే లూస్ (2), నదిన్ డి క్లెర్క్ (8), అనెకె బాస్చ్ (1) ఆసీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. క్లొయె ట్రియాన్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్)లాంటి బ్యాటర్ ఇంకొక్కరు జతయినా సఫారీ కొత్త చరిత్ర సృష్టించేది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) డిక్లెర్క్ (బి) మరిజన్ 18; బెత్ మూనీ నాటౌట్ 74; ఆష్లే గార్డ్‌నర్ (సి) లూస్ (బి) ట్రియాన్ 29; గ్రేస్ (బి) ఎమ్‌లబా 10; మెగ్ లానింగ్ (సి) ట్రియాన్ (బి) మరిజన్ 10; ఎలైస్ పెరీ (సి) బ్రిట్స్ (బి) షబ్నెమ్ 7; జార్జియా (బి) షబ్నెమ్ 0; తాహ్లియా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–36, 2–82, 3–103, 4–122, 5–155, 6–155. బౌలింగ్: ఎమ్‌లబా 3–0–24–1, షబ్నెమ్ 4–1–26–2, మరిజన్ కాప్ 4–0–35–2, అయబొంగ ఖాకా 4–0–27–0, నదిన్ డిక్లెర్క్ 3–0–27–0, క్లోయె ట్రియాన్ 2–0–15–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లారా వోల్‌వార్ట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షట్ 61; బ్రిట్స్ (సి) మెక్‌గ్రాత్ (బి) బ్రౌన్ 10; మరిజన్ (సి) బ్రౌన్ (బి) గార్డ్‌నర్ 11; లూస్ రనౌట్ 2; ట్రియాన్ (బి) జొనసెన్ 25; డి క్లెర్క్ నాటౌట్ 8; బాష్ రనౌట్ 1; జాఫ్త నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–17, 2–46, 3–54, 4–109, 5–121, 6–122. బౌలింగ్: మేగన్ షట్ 4–0–23–1, ఆష్లే గార్డ్‌నెర్ 4–0–20–1, డార్సి బ్రౌన్ 4–0–25–1, పెరీ 1–0–5–0, జెస్ జొనసెన్ 3–0–21–1, జార్జియా 2–0–21–0, తాహ్లియా మెక్‌గ్రాత్ 2–0–17–0.
Comments
Please login to add a commentAdd a comment