దక్షిణాఫ్రికా దేశం మొత్తం ఆదివారం మునివేళ్లపైకి రానుంది. పునరాగమనం తర్వాత అటు పురుషుల క్రికెట్‌లో గానీ, ఇటు మహిళల క్రికెట్‌లో గానీ ఏ ఫార్మాట్‌లోనైనా సాధ్యంకాని రీతిలో ఈసారి టీమ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
స్వదేశంలో సత్తా చాటి తుది పోరుకు వచ్చిన టీమ్ ఈ అవకాశాన్ని పోగొట్టుకోరాదని భావిస్తోంది. అయితే అటువైపు ఉన్నది సాధారణ జట్టు కాదు. ఐదుసార్లు చాంపియన్ కావడంతో పాటు ప్రొఫెషనలిజంతో ప్రత్యర్థులకు పాఠాలు చెప్పగల ఆ్రస్టేలియా. ఇలాంటి నేపథ్యంలో తమ అభిమానుల ముందు సఫారీ మహిళల కల నెరవేరగలదా?
కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే ఈ పోరులో తొలిసారి ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికా తలపడనుంది. టోర్నీ లో ప్రదర్శన, గత రికార్డు చూస్తే ఆసీస్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... సెమీస్‌లో ఇంగ్లండ్‌పై చూపిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే సఫారీ టీమ్‌లో కూడా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయినట్లుగా ఉంది. ఈ స్థితిలో పోరు ఏకపక్షమా, హోరాహోరీగా సాగుతుందా చూడాలి. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తుది పోరుకు చేరడంతో ఫైనల్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
సమష్టితత్వంతో...
టోర్నీ లో ఆసీస్ ఆటతీరు చూస్తే ఆ జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడలేదు. ప్రతీ ఒక్కరు పరిస్థితులకు తగినట్లుగా ఆడారు. బ్యాటింగ్‌లో అలీసా హీలీ, బెత్ మూనీ చెరో రెండు అర్ధ సెంచరీలతో ముందు వరుసలో ఉండగా... తాలియా మెక్‌గ్రాత్, కెప్టెన్ మెగ్ లానింగ్ కీలక సమయాల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లతో జట్టును నిలబెట్టారు.
బౌలింగ్‌లో మెగాన్ షుట్ (9 వికెట్లు), డార్సీ బ్రౌన్, వేర్‌హమ్ (చెరో 6 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు గార్డ్‌నర్, ఎలీస్ పెర్రీ ఆసీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు.
వారిద్దరే కీలకం...
టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. అమ్మాయిలంతా తీవ్ర విషాదంలో మునిగిపోగా, సొంత అభిమాలు కూడా ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఆ తర్వాత జట్టు ఆట ఒక్కసారిగా మెరుగైంది. ముఖ్యంగా తజ్మీన్ బ్రిట్స్ (176 పరుగులు), లౌరా వాల్‌వార్ట్ (169) బ్యాటింగ్ భారాన్ని మోశారు.
అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడం జట్టు బలహీనతను చూపిస్తోంది. దీనిని ఫైనల్లో ఎలా అధిగమిస్తారనేది చూడాలి. బౌలింగ్‌లో ఖాకా, మరిజాన్ కాప్, షబ్నెమ్ ప్రదర్శన కూడా దక్షిణాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
6 ఇరు జట్ల మధ్య 6 టి20లు మ్యాచ్‌లు జరగ్గా, అన్నీ ఆ్రస్టేలియానే గెలిచింది.
19 గత 20 అంతర్జాతీయ టి20ల్లో ఆ్రస్టేలియా 19 గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment