స్మృతి మంధాన- విరాట్ కోహ్లి (PC: BCCI)
WPL 2023- Smriti Mandhana: ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజే వేరు. రోజురోజుకు ఆర్సీబీ అభిమానగణం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా స్టార్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆర్సీబీ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించిన కోహ్లి ట్రోఫీ గెలవకపోయినా తన అద్భుత ఆట తీరుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. గత సీజన్‌తో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లి ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
స్మృతి సారథ్యంలో
ఇదిలా ఉంటే.. భారత మహిళా క్రికెట్‌లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మహిళా ప్రీమియర్ లీగ్ మార్చి 4న ఆరంభమైన విషయం తెలిసిందే. ఐదు జట్లు పోటీపడుతున్న ఈ టీ20 లీగ్‌లో ఆర్సీబీ వుమెన్ టీమ్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మార్చి 5న మ్యాచ్ పూర్తి చేసుకున్న స్మృతి సేన.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లితో తనను పోలుస్తూ వస్తున్న వార్తలపై విలేకరుల ప్రశ్నకు స్మృతి ఈ విధంగా సమాధానమచ్చింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పోలికలు నాకు అస్సలు నచ్చవు. ఎందుకంటే కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో అద్భుత రికార్డులు సాధించాడు. నేను ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకోవడమే తప్ప.. కనీసం కోహ్లి రికార్డులకు దరిదాపుల్లో కూడా లేను.
ముఖ్యంగా ఆర్సీబీకి కోహ్లి అందిస్తున్న సేవలు అమోఘం. నేను కూడా తనలా ఉండేందుకు, జట్టును గొప్ప స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా’’ అని స్మృతి పేర్కొంది. కాగా డబ్ల్యూపీఎల్-2023 వేలంలో భాగంగా ఆర్సీబీ అత్యధికంగా 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్మృతి మంధానను కొనుగోలు చేసింది. ఇక కోహ్లి, స్మృతి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం. ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి ఘనత..
ఇక 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి.. 2021 సీజన్ తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. సారథిగా 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు నమెదు చేశాడు. మరో 4 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2016లో రన్నరప్‌గా నిలిచింది.
మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. ఇక సుదీర్ఘకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ఈ రన్‌మెషీన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 74 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
చదవండి: WPL 2023: ఎంఎస్‌డీ పేరును బ్యాట్‌పై రాసుకుని హాఫ్ సెంచరీ బాదిన యూపీ వారియర్జ్ బ్యాటర్
Ind Vs Aus: ‘అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు.. వాళ్లు రాజీనామా చేయాల్సిందే’.. టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment