ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత పొందగా... ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. యూపీ గెలుపుతో గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాష్లే గార్డ్‌నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి విజయం సాధించింది.
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్‌ను తాలియా (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా... సోఫీ ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) యూపీ విజయాన్ని ఖాయం చేసింది.
ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ షాక్
సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది.
పూజ వస్త్రకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), ఇసీ వాంగ్ (24 బంతుల్లో 23; 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
ఢిల్లీ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెన్ (2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా.. మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు.
‘ఫైనల్ బెర్త్’ రేసులో ముంబై, ఢిల్లీ
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్‌లో, ముంబై రెండో ర్యాంక్‌లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరుతో ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... యూపీతో ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు ‘టాప్’ ర్యాంక్‌తో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment