మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) మెరుపు అర్ధశతకంతో, ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), నాట్ సీవర్-బ్రంట్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు), పూజా వస్త్రాకర్ (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.
గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2.. వేర్‌హమ్, గార్డ్‌నర్, తనుజా కన్వర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్ సీవర్-బ్రంట్ (2-0-5-2), అమేలియా కెర్ర్ (2-1-12-2), ఇస్సీ వాంగ్ (3-0-7-1) ధాటికి 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి పేకమేడలా కూలింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (23 బంతుల్లో 29 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), 11వ నంబర్ ప్లేయర్ మోనికా పటేల్ (9 బంతుల్లో 10; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.
గుజరాత్ స్కోర్ కార్డు సున్నాలు, సింగిల్ డిజిట్ స్కోర్లతో నిండుకుని ఫుట్‌బాల్ స్కోర్ కార్డును తలపించింది. సబ్బినేని మేఘన (2), బెత్ మూనీ (0 రిటైర్డ్ హర్ట్), హర్లీన్ డియోల్ (0), ఆష్లే గార్డ్‌నర్ (0), అన్నాబెల్ సుదర్‌లాండ్ (6), జార్జియా వేర్‌హమ్ (8), స్నేహ్ రాణా (1), తనుజా కన్వర్ (0), మాన్సీ జోషీ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన సైకా ఇషాఖీ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇషాఖీ ఎవరు.. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు నెటిజన్లు. సైకా ఇషాఖీ గురించి నెట్‌లో సెర్చ్ చేయగా.. ఆమె ఓ దిగువ మధ్యతరగతి బెంగాలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన 27 ఏళ్ల ఇషాఖీ.. టీమిండియా తరఫున అరంగేట్రం చేయనప్పటికీ ఇండియా డి వుమెన్, ట్రయల్‌బ్లేజర్స్, బెంగాల్, ఇండియా ఏ వుమెన్ జట్లకు ప్రాతినిధ్యం వహించినట్లుగా తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యమున్న ఇషాఖీ.. 2021లో ఇండియా-సితో జరిగిన ఓ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో అమేలియా కెర్ర్, హేలీ మాథ్యూస్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లు ఉన్నా, ఇషాఖీ వారిని ఫేడ్ అవుట్ చేసి మరీ సత్తా చాటింది. ఈ ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శనతో ఇషాఖీ రాత్రికిరాత్రి స్టార్‌గా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment