వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు భారత ఆటగాళ్లను ఏకి పారేస్తున్నారు. అంతకుమించి ఐపీఎల్, బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి బీసీసీఐ, ఐపీఎలే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.
గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూల్‌ను ఫిక్స్ చేసి బీసీసీఐ పొరపాటు చేస్తే.. మ్యాచ్‌ల సంఖ్యను పెంచి ఐపీఎల్ యాజమాన్యం ఘోర తప్పిదం చేసిందని అంటున్నారు. ఐపీఎల్ షెడ్యూల్ పెరగడంతో ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసటకు లోనయ్యారని, ఈ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం లోపాయకారి ఒప్పందం చేసుకుని దేశ ప్రయోజనాలకు పణంగా పెట్టాయని మండిపడుతున్నారు.
సరే, పెంచుకుంటే పెంచుకున్నారు.. తదుపరి ప్రతిష్టాత్మక మ్యాచ్ ఉందని తెలిసి కూడా ఆటగాళ్లకు కనీస విరామం ఎందుకివ్వలేదని నిలదీస్తున్నారు. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసి బీసీసీఐ, సొంత ప్రయోజనాల కోసం ఐపీఎల్, డబ్బు కోసం ఆటగాళ్లు భారత క్రికెట్ అభిమానుల మనోభావాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తుతున్నారు.
ఓ ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్‌కు ఛేంజ్ అయ్యేప్పుడు ఆటగాళ్లకు కనీస ప్రాక్టీస్, విరామం ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బీసీసీఐ వ్యవహరిస్తే.. ఎవరెటు పోతే మాకేం, మన పని జరిగిపోయింది కదా అన్న చందంగా ఐపీఎల్ యాజమాన్యం స్వార్ధపూరితంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. ఐపీఎల్ నుంచి నేరుగా వచ్చి ఆడితే ఇలాగే ఉంటదని కామెంట్స్ చేస్తున్నారు.
విశ్వవేదికపై ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉందని తెలిసి కూడా బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం, ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇదే టీమిండియా కొంపముంచిందని ఆరోపిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్ ఆటగాళ్ల సన్నద్ధత చూసి సిగ్గు పడాలని.. కాసులు కురిపించే ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉన్నా వారు దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా హర్షనీయమని అంటున్నారు.
కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. -మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్
చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..!
Comments
Please login to add a commentAdd a comment