టీమిండియా
WTC Final 2023: సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా పుజారాను నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా మేటి జట్లు టీమిండియా- ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్న విషయం తెలిసిందే.
రహానే వచ్చేశాడు
ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7-11 మధ్య ఈ మెగా ఫైట్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, వైస్ కెప్టెన్‌గా మాత్రం ఇంత వరకు ఎవరి పేరును ఖరారు చేయలేదు.
ఐపీఎల్-2023లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో పునరాగమనం చేసిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. పుజారాలలో ఎవరో ఒకరిని రోహిత్ డిప్యూటీని చేస్తారంటూ చర్చించుకుంటున్నారు క్రికెట్ ప్రేమికులు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘పుజారానే టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు.
అధికారిక ప్రకటన అప్పుడే
అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇంతవరకు పుజారా నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఐసీసీకి ఫైనల్ జట్టు గురించి వివరాలు సమర్పించే సమయం(మే 23)లో పుజారా పేరును వైస్ కెప్టెన్‌గా మెన్షన్ చేయనున్నారు. ససెక్స్ కెప్టెన్‌గా ఛతేశ్వర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం’’ అని పేర్కొన్నారు. టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా పుజారా పేరు ఖరారు కానుందని తెలిపారు.
కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన పుజారా.. కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా అద్బుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటున్నాడు.
మూడు సెంచరీలతో
వరుసగా 115, 35, 18, 13, 151, 136 & 77 పరుగులతో సూపర్ ఫామ్ కనబరిచిన పుజారా.. ససెక్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌కు సహచర ఆటగాడిగా ఉండటం విశేషం. ఇన్నాళ్లు ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ సందర్భంగా ఎప్పటిలానే ప్రత్యర్థులుగా మారనున్నారు.
కాగా మే 24 నాటికి కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కీలక ప్లేయర్లు లండన్‌కు చేరుకోనుండగా.. పుజారా కాస్త ఆలస్యంగా జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న.. శార్దూల్ ఠాకూర్(కేకేఆర్), ఉమేశ్ యాదవ్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తదితరులు ద్రవిడ్ కలిసి మే 23నే లండన్‌కు పయనం కానున్నట్లు సమాచారం.
డబ్ల్యూటీసీ ఫైనల్-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
చదవండి: లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా!
అభిషేక్ తప్పేం లేదు! వాళ్ల వల్లే ఇలా: టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment