WTC Final 2023: Axar Patel Says Indian Players Practice With Dukes Ball During IPL 2023 - Sakshi
Sakshi News home page

#Axar Patel: ఐపీఎల్‌-2023 సమయంలోనూ డ్యూక్‌ బాల్స్‌తో ప్రాక్టీస్‌ చేశాం.. ఎందుకంటే..

Published Thu, Jun 1 2023 2:31 PM | Last Updated on Thu, Jun 1 2023 3:33 PM

WTC Final Axar Patel: Indian Players Practice With Dukes Ball During IPL - Sakshi

WTC Final 2021-23: ‘‘ఐపీఎల్‌ ఆడుతున్న సమయంలోనూ మేము రెడ్‌బాల్‌తో ఎలా బౌలింగ్‌ చేయాలన్న అంశంపై చర్చించాం. మా దగ్గర రెడ్‌బాల్స్‌ ఉండేవి. అప్పుడప్పుడు మేము వాటితో ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. వీలు దొరికినప్పుడల్లా నెట్స్‌లో కసరత్తులు చేసేవాళ్లం.

నిర్విరామంగా రెండేసి నెలల పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడి వెంటనే టెస్టు ఫార్మాట్‌కు మారడం అంటే కొంచెం కష్టమే. మానసికంగా సిద్ధపడితేనే ఒత్తిడి అధిగమించగలం’’ అని టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పేర్కొన్నాడు.

బీజీటీ-2023లో గెలిచి
ఐపీఎల్‌-2023 సమయం నుంచే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సిద్ధమయ్యే పనిలో పడ్డామని వెల్లడించాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్‌.. కంగారూలతో పాటు తుదిమెట్టుపై అడుగుపెట్టింది.

ఈ క్రమంలో జూన్‌ 7-11 మధ్య ఇంగ్లండ్‌ వేదికగా టీమిండియా- ఆసీస్‌ ఐసీసీ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర్‌ పటేల్‌ ఐసీసీతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్‌ సందర్భంగా డ్యూక్‌ బాల్స్‌తో ప్రాక్టీస్‌ చేసినట్లు తెలిపాడు.

డ్యూక్‌ బాల్స్‌తో ప్రాక్టీస్‌
‘‘ఐపీఎల్‌ సమయంలో మేము డ్యూక్‌ బాల్స్‌ ఆర్డర్‌ చేశాం. వాటితో ప్రాక్టీస్‌ చేశాం. మ్యాచ్‌ జరిగేది ఇంగ్లండ్‌లో! కాబట్టి డ్యూక్‌ బంతులతో ఆడటం అలవాటు చేసుకోవాలని ఇలా చేశాం. నిజానికి వైట్‌ బాల్‌ నుంచి రెడ్‌ బాల్‌కు మారడం.. ఎస్‌జీ బాల్స్‌ నుంచి డ్యూక్‌ బాల్స్‌కు మారడం వంటిదే.

అయితే, ఇలాంటి సమయాల్లోనే మన నైపుణ్యాలకు పదునుపెట్టాల్సి వస్తుంది. ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలగాలి. ఎలాంటి బాల్‌ అయినా సరే.. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయగలగాలి. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఇంగ్లండ్‌లో జరుగబోతోంది. భారత్‌తో పోల్చుకుంటే అక్కడ పిచ్‌ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’’ అని అక్షర్‌ పటేల్‌ వ్యాఖ్యానించాడు.


PC: TOI

కాగా భారత్‌ వేదికగా జరిగిన బీజీటీ-2023లో బంతి కంటే కూడా బ్యాట్‌తోనే అక్షర్‌ రాణించాడు. ఆసీస్‌తో ఈ టెస్టు సిరీస్‌లో 264 పరుగులు సాధించాడు. ఉస్మాన్‌ ఖవాజా(333), విరాట్‌ కోహ్లి (297) తర్వాతి స్థానంలో నిలిచాడు.

డ్యూక్‌ బాల్స్‌..
1760లో డ్యూక్‌ కుటుంబం క్రికెట్‌ ఎక్విప్‌మెంట్‌ తయారు చేసే కంపెనీని ప్రారంభించింది. 1987లో ఈ కంపెనీని భారత వ్యాపారవేత్త దిలీప్‌ జజోడియా కొనుగోలు చేశారు. ఈ కంపెనీ తయారు చేసే బాల్స్‌ డ్యూక్‌ బాల్స్‌గా పేరొందాయి. వీటిని ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లలో ఉపయోగిస్తారు. ఎస్‌జీ బాల్‌ను బారత్‌లో వాడతారు. 
చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. రవీంద్ర జడేజాకు నో ఛాన్స్‌! కారణమిదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement