
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ అని విశ్లేషకులంతా ముక్తకంఠంతో వాదిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో సరిసమానమైన విజయావకాశాలు టీమిండియాకు కూడా ఉన్నాయని ఆయన బలంగా వాదిస్తున్నాడు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆసీస్ విజయం సాధించేందుకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతున్నది ఆస్ట్రేలియాలో కాదని, ఈ మ్యాచ్ జరుగుతున్నది ఇంగ్లండ్‌లో అన్న విషయాన్ని విశ్లేషకులు గమనించాలని గుర్తు చేశాడు.
ఓవల్ లాంటి మైదానంలో టీమిండియాతో పోలిస్తే ఆసీసే ఎక్కువ జాగ్రత్త వహించాలని, అంచనాలు తప్పేందుకు ఒక్క సెషన్ ఆట చాలని హెచ్చరించాడు. టీమిండియాతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు.
గత పదేళ్ల కాలంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడంపై శాస్త్రి స్పందిస్తూ.. ఈ మధ్య కాలంలో టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడిన్నప్పటికీ, చాలా సందర్భాల్లో లక్ కలిసి రాలేదని, ఐసీసీ ట్రోఫీ సాధించాలంటే మంచి క్రికెట్‌తో పాటు కాస్త లక్ కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో ప్రస్తుత టీమిండియా చాలా పటిష్టమైందని, ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. కాగా, రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌ను న్యూజిలాండ్‌కు కోల్పోయింది. సౌథాంప్టన్ వేదికగా జరిగిన నాటి ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.
చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్
Comments
Please login to add a commentAdd a comment