
కోహ్లి వికెట్ తీసే అరుదైన ఛాన్స్.. అంచనాలు తలకిందులు ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు.. అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లి పరుగుల మోత.. మిడిలార్డర్‌లో రాణిస్తూ జట్టును ఆదుకుంటున్న సూర్యకుమార్ యాదవ్.. టోర్నీ తాజా ఎడిషన్‌లో 220 రన్స్‌తో టాప్‌లో.. జయవర్ధనే రికార్డు బద్దలు కొట్టి ఓవరాల్‌గా టాప్ రన్ స్కోరర్‌గా కోహ్లి..
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా అవతరించిన సూర్య.. ఇక బౌలర్లు సరేసరి.. అటు సీనియర్ భువనేశ్వర్ కుమార్.. ఇటు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు.. ఫీల్డింగ్‌లోనూ లోపాలు సరిదిద్దుకుని మరింత పటిష్టమైన జట్టుగా టీమిండియా..
సవాల్ విసిరిన జింబాబ్వే కెప్టెన్!
ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్న రోహిత్ సేన సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. మేటి జట్టు.. వరల్డ్‌క్లాస్ బ్యాటర్లు.. మరి ప్రత్యర్థి భయపడటం సాధారణమే కదా! అయితే, గొప్ప జట్టుతో పోటీపడటం తమకే లాభిస్తుందంటున్నాడు జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్.
పాకిస్తాన్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించిన జింబాబ్వే.. నెదర్లాండ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి చతికిలపడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా బ్యాటర్లను కట్టడి చేసేందుకు తమ బౌలర్లు సంసిద్ధంగా ఉన్నారంటూ క్రెయిగ్ సవాల్ విసరడం విశేషం.
గ్రూప్-2లో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టుతో ఆదివారం(నవంబరు 6) జింబాబ్వే తలపడనున్న నేపథ్యంలో జింబాబ్వే సారథి క్రెయిగ్ ఎర్విన్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘టీమిండియా బ్యాటర్లను ఎదుర్కోవడానికి మా బౌలర్లు సిద్ధంగా ఉన్నారు.
అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్!
ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్లకు బౌలింగ్ చేయడం కంటే అదృష్టం, అవకాశం మరొకటి ఉండదు. కాబట్టి మా వాళ్లు తప్పకుండా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సన్నద్ధమయ్యారు. విరాట్ కోహ్లి వికెట్ తీసే అవకాశం ఎంత మందికి వస్తుంది?
అలాంటి అరుదైన, అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్‌ను ఎవరు మాత్రం వదులుకుంటారు! రేపటి మ్యాచ్‌లో మా ఫాస్ట్ బౌలర్లు కచ్చితంగా తమ సత్తా చాటుకుంటారు’’ అని తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వెల్లడించాడు.
అలాంటివి వర్కౌట్ కావేమో!
ఇక కోహ్లి అత్యుత్తమ ఆటగాడు అంటూ కొనియాడిన 37 ఏళ్ల ఎర్విన్.. అతడి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలేమీ రచించలేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేసే మేటి బ్యాటర్ల విషయంలో స్పెషల్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కావు గానీ తమ బౌలర్లు మాత్రం పట్టుదలగా పోరాడటం ఖాయమని చెప్పుకొచ్చాడు. కాగా మెల్‌బోర్న్‌లో టీమిండియా- జింబాబ్వే మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రూప్-2 నుంచి ఏ రెండు జట్లు సెమీస్‌కు చేరతాయన్న అంశం తేలనుంది.
చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా
T20 WC 2022: వర్షంతో మ్యాచ్ రద్దయినా టీమిండియాకే మేలు