సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విశ్వసనీయత, విలువల్లేని రాజకీయ నేతల వల్ల నెల్లూరు జిల్లాకు చెడ్డపేరు వస్తోంది. వైఎస్సార్‌సీపీ బీ ఫారం ద్వారా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. వైఎస్ కుటుంబానికి వీరవిధేయులమని నిత్యం వల్లించిన ఆ ముగ్గురు శాసససభ్యులు డబ్బు కోసం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ప్రవర్తించారని ప్రజానీకం ఛీ కొడుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం శుక్రవారం సస్పెన్షన్ వేటు వేయడంతో సింహపురి రాజకీయ కట్టప్పలకు సరైన గుణపాఠం చెప్పారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుటుంబంలో రాజకీయ సస్పెన్షన్ల చరిత్ర ఉంది. టీడీపీలో సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్‌రావుకి రామనారాయణరెడ్డి తండ్రి వెంకటరెడ్డి మద్దతు ఇవ్వడంతో అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. రాజకీయ గుర్తింపు వచ్చేలా చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండాల్సిన ఆనం కుటుంబం వ్యతిరేకంగా పనిచేసింది. అయినా 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసు చేసుకుని వెంకటగిరి సీటును రామనారాయణరెడ్డికి ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడవడంతో సస్పెండ్ చేసింది.
గతంలో కూడా..
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఇప్పటికి రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి విజయానికి సహకరించారు. దీంతో మేకపాటిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో మేకపాటి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడైన చంద్రశేఖర్‌రెడ్డికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం దక్కేలా చేశారు.
2014లో ఓటమి చెందినా 2019లో మళ్లీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ దఫా మాత్రం మేకపాటి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత కుటుంబంపైనే తిరుగుబాటు చేసినట్లు చెబుతున్నారు. అవినీతి, అక్రమాలను ప్రోత్సహించి వసూళ్ల రాజాగా మారారు. అతని తీరుపై ఫిర్యాదులు వెళ్లడంతో పార్టీ అధిష్టానం మందలించింది. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న సంకేతాలతో చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. నమ్మకద్రోహం చేసిన చంద్రశేఖర్‌రెడ్డి దిష్టిబొమ్మను వింజమూరులో శుక్రవారం దహనం చేశారు.
ఆది నుంచి శ్రీధర్‌రెడ్డిది అదే తీరు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరు ఆది నుంచి వివాదాస్పదమే. విద్యార్థి సంఘం నుంచి బీజేపీలో చేరిన ఆయన రూరల్ మండలాధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి చెందారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో 1989లో ఆ పార్టీ నుంచి సన్పెన్షన్‌కు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి నేదురుమల్లి జనార్దనరెడ్డి సహకారంతో యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ పదవి తెచ్చుకున్నారు. తర్వాత నేదురుమల్లితో విభేదించి అప్పటి పీసీసీ చీఫ్ హనుమంతరావు చెంతన చేరారు. ఆపై పి.జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వద్దకు వెళ్లారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోటంరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి ఓ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. వైఎస్ మరణంతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. జగన్ సముచిత స్థానం కల్పించి 2014, 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. అధికారం చేతిలో ఉందని విర్రవీగిన కోటంరెడ్డిపై అధిష్టానం సీరియస్ కావడంతో ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా చేసి టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తానంటూ టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి పెంచి పెద్ద చేసిన వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచారు.
కొండాపురంలో..
కొండాపురం: మండలంలోని కొమ్మి గ్రామంలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిచంద్రశేఖర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఫ్లెక్సీకి చెప్పులు వేలాడదీశారు. అనంతరం చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గానికి పట్టిన పీడ విరగడైందని ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీకి అమ్ముడుబోయిన చంద్రశేఖర్‌రెడ్డికి సరైన శిక్ష వేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మన్నం వెంకటసుబ్బయ్య, మాల్యాద్రి, ప్రభాకర్, ఖాజారంతుల్లా, హరి చౌదరి, తేజ నాయక్, మధు, రాజేష్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment