సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి చేరిక తెలుగుదేశంలో కొత్త సమస్యలు తెచ్చింది. ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకించినా పట్టించుకోకుండా చేర్చుకోవడంతో వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. గిరి చేరిక కార్యక్రమానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లాలో సీనియర్ నేత అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి అబ్దుల్ అజీజ్‌తోపాటు సీనియర్లు హాజరుకాకపోవడం చూస్తే ఆ పార్టీ లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
అన్నీ తానై..
జిల్లాలో లోకేశ్ టీంగా ప్రస్తుతం వ్యవహారాలు నడిపిస్తున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు పట్టాభి టీడీపీలోకి గిరిధర్‌రెడ్డి చేరిక విషయంలో అన్నీ తానై వ్యవహరించాడు. పార్టీ జిల్లా అధ్యక్షుడికే వ్యతిరేకంగా అంతర్గత విషయాల్లో పట్టాభి తలదూర్చడంపై కూడా సీనియర్లు గుర్రుమంటున్నారు. ఆయన గురించి నారాయణ వద్ద తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో పంచాయితీ కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంట్రీకి ముందే ఫ్లెక్సీ వివాదం
గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరికకు ముందే ఫ్లెక్సీల వివాదం మొదలైంది. కోటంరెడ్డి బ్రదర్స్ నగరంలో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీల్లో ఎక్కడా జిల్లాలోని సీనియర్ నేతల ఫొటోలు వేయలేదు. కేవలం చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ ఫొటోలు మాత్రమే పెట్టారు. సీనియర్ నేతలు లేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు నోరెళ్లబెట్టారు.
ఇప్పటికే..
రానున్న ఎన్నికల్లో జిల్లాలో లోకేశ్ వర్గంగా చెప్పుకునే కొత్త ముఖాలే బరిలో ఉంటాయని చెబుతున్నారు. గతంలో పలుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన వారిని పక్కన పక్కకు తప్పించేయత్నం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో తమకు అవకాశం వస్తుందో రాదో తెలియక సీనియర్లు ఆందోళనలో ఉన్నారు. దీనికితోడు కోటంరెడ్డి బ్రదర్స్ విషయంలో వారి మాటను పట్టించుకోకపోవడంతో బాధలో మునిగిపోయారు.
► సోమవారం టీడీపీ సీనియర్ నాయకులు బీద రవిచంద్ర, నారాయణ, అబ్దుల్ అజీజ్ చంద్రబాబును హైదరాబాద్‌లో కలిశారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే గిరిధర్‌రెడ్డిని చినబాబు వర్గం యువగళం పాదయాత్రకు తీసుకెళ్లింది. ప్రత్యేకంగా లోకేశ్‌ను కలిపించడంతో సీనియర్లకు పుండు మీద కారం చల్లినట్లయింది.
కీలకంగా చినబాబు వర్గం
కోటంరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి తెలిసిన టీడీపీ సీనియర్ నేతలు ఆది నుంచి వారిని పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా రెండు దఫాలు అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచిన శ్రీధర్‌రెడ్డిని అక్కున చేర్చుకుంటే టీడీపీలో అదే సీన్ రిపీట్ చేయరని నమ్మకం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన బ్రదర్స్‌ను సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా కష్టపడిన వారి మాటను తోసిపుచ్చి కేవలం ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం వారికి ఎంట్రీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతోనే గిరి జాయినింగ్ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు ఎవరూ వెళ్లొద్దని సీనియర్ నేతలు హుకుం జారీ చేశారు. చాలావరకు టీడీపీ కార్యకర్తలు వెళ్లకపోవడంతో రోజువారీ పనులు చేసుకునే వారికి కోటంరెడ్డి బ్రదర్స్ రూ.500 చొప్పున పంపిణీ చేసి కార్యకర్తలుగా చూపించినట్లు నాయకులే చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment