సాక్షిప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోను కందుకూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ ఎవరికన్న దానిపై అనిశ్ఛితి నెలకొంది. టికెట్ రేసులో నాయకుల మధ్య విభేదాలు ఎంతకూ తెగడం లేదు. టికెట్ నాదే అని పార్టీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు చెప్పుకుంటుంటే, ఆయన ప్రత్యర్థి వర్గం ఆయనకు టికెట్ దక్కకుండా ఎత్తులు వేస్తోంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేసిన తొలి జాబితాలో నాగేశ్వరరావు పేరు లేకపోవడం, అదే సందర్భంలో ఆయన ప్రత్యర్థి వర్గం సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతుండడంతో నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అయోమయ వాతావరణం నెలకొంది.
నిరాశలో ఐఎన్‌ఆర్ శిబిరం
ప్రధానంగా టీడీపీ టికెట్ కోసం ప్రస్తుత పార్టీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, ఆయన ప్రత్యర్థి వర్గ నాయకులైన ఇంటూరి రాజేష్, కోటపాటి జనార్దన్, మహిళా నాయకురాలు ఉన్నం నళినీదేవిల మధ్య పోరు తారాస్థాయికి చేరుతోంది. నాగేశ్వరరావుకి టికెట్ దక్కకుండా చేయడంతో పాటు, తమలో ఎవరికో ఒకరికి టికెట్ కేటాయించేలా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల నాలుగైదు రోజుల నుంచి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల 24న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 94 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు.
తొలి జాబితాలో పేరు లేకపోవడంతో నాగేశ్వరరావు వర్గం పూర్తిగా డీలా పడిపోయింది. రెండు సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలను ఆయన చూస్తున్నారు. అధిష్టానం చెప్పిన కార్యక్రమాలను అమలు చేసుకుంటూ టికెట్ తనకే వస్తుందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తొలి జాబితా విడుదల తరువాత అసలు పార్టీలో ఏం జరుగుతుందోనని, తన పేరు ఎందుకు జాబితాలో లేదంటూ అయోమయంలో పడ్డారు. జాబితాలో తన పేరు లేకపోవడానికి కారణం ఏమిటి, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, ఎవరు అడ్డుకున్నారనే విశ్లేషణలతో ప్రస్తుతం నాగేశ్వరరావు శిబిరం నాయకులు లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు.
బల ప్రదర్శనకు దిగుతున్న ప్రత్యర్థి వర్గం
తొలి జాబితాలో ఇంటూరి నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన ప్రత్యర్థి వర్గం నాయకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇదే అదునుగా తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. నాగేశ్వరరావుకు టికెట్ దక్కకుండా అడ్డుకోవడం ఒక ఎత్తైతే, తమలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కించుకునే వ్యూహం మరొకటి. దీనిలో భాగంగా గత రెండు రోజులుగా బల ప్రదర్శనకు దిగుతున్నారు. ప్రధానంగా ఇంటూరి రాజేష్ మంగళవారం తన వర్గం నాయకులతో కలిసి కందుకూరు నుంచి ర్యాలీగా నెల్లూరు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిశారు.
ఇది కచ్చితంగా బల ప్రదర్శనకు దిగడమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మరో నేత కోటపాటి జనార్దన్ పామూరు రోడ్డులోని కళ్యాణ మండపంలో తన వర్గంతో సమావేశమయ్యారు. ఈయన టిక్కెట్ దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేసేందుకై నా వెనుకాడేది లేదని, పార్టీ అధిష్టానం వద్ద రూ.50 కోట్ల వరకు డిపాజిట్ చేసేందుకు కూడా సిద్ధమేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ తనకే వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఇటీవల బీజేపీ నుంచి టీడీపీలో చేరిన మహిళా నాయకురాలు కూడా టికెట్ నాదేనని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఓ మీడియా అధినేతతో పాటు, ప్రస్తుత, మాజీ బీజేపీ పెద్దలపై ఈమె ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితుల్లో కేడర్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment