ఐదు ఎన్నికల నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్
1999 నుంచి 2019 వరకు ఇదే తరహాలో..
ఉదయగిరి: గిరిలో గెలిస్తే.. ఏపీలో అధికారమా.. ఇదేంది.. ఇలా ఎలా అనే అనుమానం కలగక మానదు. అయితే గడిచిన ఐదు ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇదే ఆనవాయతీ కొనసాగుతోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో 1999 ఎన్నికలు మొదలుకొని 2019 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. ఉదయగిరి కోటపై జెండా ఎగురవేసే పార్టీయే రాష్ట్రంలో అధికార పగ్గాలు దక్కించుకుంటుందనే విశ్వాసం ఈ ప్రాంత ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో బలంగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో.. ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆనవాయతీ నిజమవుతుందా లేక సెంటిమెంట్‌కు తెరపడుతుందాననే అంశం ఫలితాల్లో తేటతెల్లం కానుంది.
ఇదీ తీరు..
👉 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున కంభం విజయరామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేయగా, టీడీపీ విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
👉 2004లో కాంగ్రెస్ తరఫున మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కంభం విజయరామిరెడ్డి బరిలో నిలవగా, మేకపాటికే విజయం వరించింది. అప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేజిక్కించుకుంది.
👉 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ తరఫున వీరే బరిలో నిలవగా, మేకపాటికే విజయం చేకూరింది. అప్పుడూ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంది.
👉 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బొల్లినేని రామారావు, వైఎస్సార్సీపీ తరఫున మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోటీపడగా, టీడీపీ విజయం సాధించింది. రాష్ట్రంలోనూ టీడీపీ అధికారం చేపట్టింది.
👉 2019 ఎన్నికల్లో వీరే పోటీపడగా, భారీ మెజార్టీతో చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment