
ట్రాక్టర్ ట్రాలీ తిరగబడి మహిళ మృతి
● ఇద్దరికి గాయాలు
లింగసముద్రం: వారంతా కూలీలు. అప్పటి వరకు పొగాకు పొలంలో పనిచేశారు. తర్వాత ట్రాక్టర్‌లో వెళ్తుండగా ట్రాలీ తిరగబడింది. దీంతో ఓ మహిళా కూలీ మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఆర్‌ఆర్ పాళెం గ్రామం వద్ద శనివారం జరిగింది. ఎస్సై మహమ్మద్ సుభానీ కథనం మేరకు.. మొగిలిచర్ల పంచాయతీలోని నారసింహాపురం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో పొగాకు ఆకులు రెలిపేందుకు మొగిలిచర్ల గ్రామానికి చెందిన 22 మంది కూలీలు ట్రాక్టర్‌లో వెళ్లారు. పని పూర్తయ్యాక ఇంటికి బయలుదేరారు. పెంట్రాల నుంచి మొగిలిచర్లకు వెళ్లే రోడ్డుకు సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ బండరాయిని ఎక్కడంతో తిరగబడింది. దీంతో ట్రాలీలో ఉన్న పోతినేని కుమారి (50), మరికొందరిపై పచ్చాకు పడిపోయింది. తోటి కూలీలు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కుమారి ఊపిరాడక మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం కుమారి మృతదేహాన్ని కందుకూరుకు తరలించారు. ఈ ఘటనపై కుమారి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment