
రైతులకు భూపరిహారం పెంచాలి
నెల్లూరు (అర్బన్): భారతమాల, సాగరమాల జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం కమిటీల నాయకులు కలెక్టర్‌ను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలోని ఏడు మండలాల్లో 108 కి.మీ. పరిధిలో సాగరమాల, 30 కి.మీ. జాతీయ రహదారులు నిర్మిస్తున్నారన్నారు. 35 గ్రామాల్లో 900 ఎకరాలు భూసేకరణ జరుగుతుందన్నారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం నామమాత్రంగా చెల్లిస్తున్నారన్నారు. గత కలెక్టర్ చెప్పిన ప్రకారం రైతులు ఆర్బిట్రేషన్ వేసినప్పటికీ ఇప్పటికీ విచారణ జరగలేదన్నారు. ఇకనైనా విచారణ జరిపి చట్ట ప్రకారం రైతులకు భూ పరిహారం పెంచాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య మాట్లాడుతూ తోటపల్లిగూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైపు లైను నిర్మాణం కోసం కోత దశకు వస్తున్న పంటలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఆ పనులు ఆపి పంట కోతలు పూర్తయ్యాక పైపులైను నిర్మాణం చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పులిగండ్ల శ్రీరాములు, సంఘాల నాయకులు వెంకమరాజు, రాజా, పోతుగుంట కృష్ణయ్య, ఆదిశేషయ్య, వంశీకృష్ణ, లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment