
వంద కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
కందుకూరు: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17.50 లక్షల విలువైన 100 కేజీల గంజాయితోపాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. కందుకూరులో డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కొంతల్లి గ్రామానికి చెందిన ఇల్లపు నాగేశ్వరరావు, నాతవరం మండలం మన్నేపురట్ల గ్రామానికి చెందిన తాడి నాగసత్యన్నారాయణ, దుర్గారావు, ఆనందవేలు మరో ఇద్దరితో కలిసి గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు. వీరు ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తుంటారు. ఈ మేరకు ఉలవపాడు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం ఉలవపాడు సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. క్యాబ్ వాహనాన్ని పోలీసులు ఆపి అందులో ఉన్న ఇల్లపు నాగేశ్వరరావు, తాడి నాగసత్యన్నారాయణను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వీరితో పాటు ఉన్న దుర్గారావు, ఆనందవేలు అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు. అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించడంతో గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. కారు డోర్లు, స్పీకర్ బాక్స్‌ల స్థానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అమరికల్లో గంజాయిని ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నట్లు చెప్పారు. కారు డోర్లలో దాచి ఉంచిన రూ.17.50 లక్షల విలువైన 95 ప్యాకెట్ల (100 కేజీల) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు కారును, సెల్‌ఫోన్లు వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఉండే వ్యక్తులతో కుదిరిన ఒప్పందం మేరకు వీరు కావలి వద్దకు గంజాయిని చేర్చాల్సి ఉందని, ఆ తర్వాత అక్కడి నుంచి వేరే బ్యాచ్ గంజాయిని తమిళనాడు వరకు చేరుస్తారన్నారు. పారిపోయిన దుర్గారావు, ఆనందవేలును కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. కార్యక్రమంలో కందుకూరు సీఐ కే వెంకటేశ్వరరావు, ఉలవపాడు ఎస్సై కే అంకమ్మ, కానిస్టేబుల్‌లు ఎన్ శంకర్, పీ శ్రీనివాసరావు, కే బ్రహ్మయ్య, ఎస్‌కే రిజ్వాన్, జయశంకర్, ఎం మాలకొండయ్య, డీ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వంద కేజీల గంజాయి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment