
వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ప్రసిది్ధ పెంచలకోన
దట్టమైన అడవులు.. నిలువెత్తు కొండలు.. ప్రకృతి సిగలో కొలువైనదే పెంచలకోన క్షేత్రం. చెంచులక్ష్మీదేవిని పెన వేసుకుని ఏకశిలా రూపంలో ఉన్న ఏకై క నరసింహ క్షేత్రమే పెంచలకోన. ఇక్కడి నరసింహుడు రాయలసీమ ఇలవేల్పు. తనకు ఇష్టమైన గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
రాపూరు: వైష్ణవ పుణ్యక్షేత్రాల్లోనే పెనుశిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పెద్దదని నానుడి. ఇది కొండలు, కోనల మధ్య ఉండడంతో అక్కడి ప్రకృతి సౌందర్యం కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం సమీపంలో కొండల నుంచి జలపాతాలు, దట్టమైన అడవులు ఉన్నందున దూరప్రాంతాల ప్రజలు, విద్యార్థులు విహార యాత్రలు సాగిస్తుంటారు. పర్యాటకులు మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలని ఇష్టపడుతుంటారు. ఈ క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, చెంచులక్ష్మీదేవిని పెనవేసుకుని శిలగా స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ స్వామికి పెనుశిల నరసింహస్వామి అని పేరు సార్థకమయినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు వైశాఖ శుద్ధ విదియ వరకు 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో సుమారు ఐదు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు.
పెంచలకోన ప్రాశస్త్యం
నెల్లూరుకు సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి 3 వేల కిలోమీటర్ల ఎత్తులో తూర్పుకనుముల్లో కణ్వనది పరీవాహక ప్రాంతంలో ఉన్న పెనుశిలకోన కాలక్రమేణా పెంచలకోనగా మారింది. గర్భగుడిలోని శిలారూపం రెండు తీగలు పెనవేసుకుని ఉన్నట్లే స్వామి, అమ్మవార్లు ఉంటారు. అయితే పెనుశిలను ఏ శతాబ్దంలో కనుగొన్నారో ఆధారాలు లభించలేదు. 1809లో హంటన్ దొర 200 ఎకరాల అటవీప్రాంతాన్ని పెంచలకోనకు ధారాదత్తం చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు దాఖలాలున్నాయి. హిరణ్య కశిపున్ని వధించిన అనంతరం ఉగ్రరూపంలో సంచరిస్తున్న లక్ష్మీనరసింహస్వామి పెంచలకోన అడవుల్లోని చెంచు వనితను చూసి మోహించి వివాహం చేసుకున్నారని ప్రతీతి. ఎత్తైన శేషాచలం కొండలు, దట్టమైన అడవుల నడుమ సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో కండలేరు చెంత స్వామివారు స్వయంగా వెలిశారని చెబుతారు. విష్ణుమూర్తి అవతారాల్లో 9వ అవతారంగా పిలవబడుతున్న క్షేత్రం పెంచలకోన.
స్వామికి పేర్లు ఎన్నో..
పెంచలకోన క్షేత్రంలోని పెంచలస్వామిని పలు పేర్లతో పిలుస్తారు. పెంచలస్వామి, పెనుశిల స్వామి, నరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి, ఛత్రవట నరసింహుడు, కొండికాసులవాడు ఇలా పలుపేర్లతో స్వామిని పిలుస్తారు.
కణ్వమహర్షి ఆశ్రమం
ఈ క్షేత్రంలో కణ్వమహర్షి తపస్సు చేసినారని అందువల్లే ఇక్కడ నదికి కణ్వనది అని కాలక్రమేణా కండ్లేరు, కండలేరుగా మారిందని ఈప్రాంత వాసులు చెపుతారు. కండలేరు వద్ద జలాశయం నిర్మించారు. దీని ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తాగు, సాగునీరుతోపాటు చైన్నె నగర ప్రజలకు తాగునీరందిస్తారు.
పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు
పెంచలకోనలో కరుణామయి ఆశ్రమం ఆఽధ్యాత్మి క కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆశ్రమంలో భవనాలు అమెరికాలోని వైట్‌హౌస్‌లా ఉంటాయి. లలితాపరమేశ్వరి ఆలయంలో చక్రీపీఠం ఉంది. విశాల ప్రాంగణంలో పచ్చదనంతోపాటు సేద తీరేందుకు పెద్దపెద్ద వృక్షాలున్నాయి. అలాగే పలు దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి. అప్పుడప్పుడూ విదేశీ భక్తులు ఇక్కడికి చేరి ధ్యానం నేర్చుకుంటారు.
అభివృద్ధి ఇలా..
పెంచలకోన క్షేత్రం అభివృద్ధి చెందుతోంది. తొలినాళ్లలో శనివారం మాత్రమే గోనుపల్లి నుంచి డప్పుల మోతలు, బాణసంచాతో శబ్దం చేసుకుంటూ కోనకు కాలినడకన భక్తులు, అర్చకులు చేరుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించి వచ్చేవారు. దట్టమైన అడవిలో కోనకు వెళ్లే సమయంలో అడవి మృగాలు రాకుండా ఉండేందుకు ఇలా శబ్దం చేసుకుంటూ వెళ్లేవారు. ఆ తర్వాత రెండు పూట్లా నైవేద్యాలు జరిపేవారు. నేడు నిత్యపూజలు జరుగుతున్నాయి.
క్షేత్ర
విశేషాలు
గొల్లబోయికి తొలి దర్శనం
పెనుశిల లక్ష్మీనరసింహస్వామి గ్రామానికి వచ్చిన తొలిసారి గొర్రెలకాపరి గొల్లబోయికి స్వామి తొలిదర్శనం ఇవ్వడంతో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో కోనకు బయలుదేరే స్వామివారికి గ్రామ సమీపంలోని గొల్లబోయిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీవారు అప్పట్లో గ్రామానికి చేరుకున్నప్పుడు తమ మహిమలను గురించి వివరించి తమకు ఆలయం నిర్మించమని చెప్పి అలాగే గొల్లబోయిని వెనుతిరిగి చూడకుండా వెళ్లమని ఆదేశించారని దారిలో గొల్లబోయిన వెనుతిరిగి చూడడంతో శ్రీవారే గొల్లబోయి శిలారూపం దాల్చారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఏటా శ్రీవారు సతీసమేతంగా గొల్లబోయికి తొలి దర్శనమిచ్చి అనంతరం కోనకు చేరుకుంటారు.
తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఒకే కొండ మధ్యభాగంలో పెంచలకోన కొండలున్నాయి. ఈ క్షేత్రంలోని కొండ రెక్కలు విప్పినట్లు గరుడ ఆకారంలో ఉంటుంది. దక్షిణం, ఉత్తర దిశలు కొండలు, తూర్పు పడమర దట్టమైన అడవులు, ఈశాన్య భాగం జలప్రవాహం, రమణీయ ప్రకృతితో ఉంటుంది. పెంచలకోన క్షేత్రంలోని గర్భగుడిని ఎప్పుడు నిర్మించారోనన్న ఆధారాలు లేకపోయినా సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని ఈ ప్రాంతీయులు చెబుతారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో సంతానలక్ష్మి వటవృక్షం ఉంది. ఈ వృక్షానికి చీరకొంగుతో ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని ఈ జనం నమ్మకం. ఈ క్షేత్రంలో సప్తతీర్థాలున్నాయి. కొండ మీద నుంచి కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలున్నాయి. వీటిల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు హరించి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ప్రసిది్ధ పెంచలకోన

వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ప్రసిది్ధ పెంచలకోన
Comments
Please login to add a commentAdd a comment