రూ.కోట్లు కొల్లగొట్టి.. పోలీసులకు చిక్కి.. | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు కొల్లగొట్టి.. పోలీసులకు చిక్కి..

Published Tue, Feb 18 2025 12:24 AM | Last Updated on Tue, Feb 18 2025 12:21 AM

రూ.కోట్లు కొల్లగొట్టి.. పోలీసులకు చిక్కి..

రూ.కోట్లు కొల్లగొట్టి.. పోలీసులకు చిక్కి..

కావలి: కావలి పట్టణంలో షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ముసుగులో జనాల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ప్రధాన నిందితుడు షేక్‌ మహబూబ్‌ సుభాని, అతని ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు యలసిరి బ్రహ్మానందంను అరెస్ట్‌ చేసినట్లు కావలి డీఎస్పీ పుల్లూరు శ్రీధర్‌ చెప్పారు. కావలిలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కావలిలో అనంతార్థ అసొసియేట్స్‌ పేరుతో 17 మంది కలిసి షేర్‌ మార్కెట్‌ ఫైనాన్సియల్‌ ట్రేడింగ్‌ను 2021లో ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుదాస లీలా స్టాక్‌ మార్కెట్‌ ఏజెన్సీ పేరుతో కూడా మరొక సంస్థను ప్రారంభించారు. దీనికి ముఖ్య సూత్రధారి షేక్‌ మహబూబ్‌ సుభాని. అలాగే ప్రభుదాస లీలా స్టాక్‌ మార్కెట్‌ ఏజెన్సీకి యలసిరి బ్రహ్మానందం హెడ్‌గా ఉన్నారు. వీరు అధిక వడ్డీ ఆశ పెట్టి ప్రజలు నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఖ్య సూత్రధారి షేక్‌ మహబూబ్‌ సుభాని కార్యాలయాన్ని మూసేసి పరారయ్యాడు. మందా ప్రభాకర్‌ అనే వ్యక్తి ముఖ్య సూత్రధారి షేక్‌ మహబూబ్‌ సుభానిపై ఫిర్యాదు అందడంతో కావలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ జి.రాజేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ సూత్రధారి సుభాని నేపథ్యం

బాపట్ల జిల్లా ఏల్చూరుకు చెందిన షేక్‌ మహబూబ్‌ సుభాని విజయవాడలోని సిద్ధార్థ అకాడమీలో ఎంసీఏ పూర్తి చేసి నరసరావుపేటలో కొంతకాలం కంప్యూటర్‌ లెక్చరర్‌గా పనిచేశాడు. తర్వాత నెట్వర్క్‌ మార్కెటింగ్‌ రంగంలోకి వచ్చి షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ మీద అవగాహన పెంచుకున్నాడు. గుంటూరు, విజయవాడలో కొంతకాలం పనిచేసి, తర్వాత కుటుంబంతో కలిసి కర్ణాటకలోని బీదర్‌, మహారాష్ట్రలోని పూణేలలో కొంత కాలం ఉన్నాడు.

కాకినాడలో...

తర్వాత కాకినాడకు మకాం మార్చి డబ్బులు షేర్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రజలకు నమ్మకం కలిగించాడు. ఆన్‌లైన్‌ షేర్‌ ట్రేడింగ్‌ ముసుగులో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ, క్రమంగా ఒక పెద్ద నెట్వర్క్‌ను సృష్టించాడు. ఏజెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత కాకినాడ నుంచి పారిపోయాడు. దీంతో సుభాని మీద కాకినాడ పోలీస్‌ స్టేషన్‌లో 2014లో చీటింగ్‌ కేసు నమోదు అయింది.

తెలంగాణలో...

కొంతకాలానికి సుభాని తెలంగాణ రాష్ట్రం మక్తల్‌ ప్రాంతానికి వెళ్లి చెప్పులు, ఫెర్టిలైజర్‌, బంగారం వ్యాపారాలు చేశాడు. అక్కడ కూడా ప్రజలను మభ్యపెట్టి షేర్‌ మార్కెట్‌ ముసుగులో కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించి పారిపోయాడు. దీంతో మక్తల్‌, మరికల్‌ పోలీస్‌ స్టేషన్లలో రెండు కేసులు నమోదు అయ్యాయి. దీంతో అరెస్ట్‌ కాకుండా సుభాని మాయమైపోయాడు. నిందితుడు పోలీసుల కంటపడకుండా అరెస్టు కాకుండా తెలివిగా జాగ్రత్త పడ్డాడు.

కావలిలో...

2021 నవంబర్‌లో కావలి పట్టణం ముసునూరు ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అనంతార్థ అసోసియేట్స్‌ అనే ఏజెన్సీని స్థాపించాడు. షేర్‌ మార్కెట్‌ ముసుగులో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ప్రజల సొమ్ముతో తన కుటుంబ సభ్యుల పేరుతో, తన ఏజెన్సీలోని వ్యవస్థాపక సభ్యుల పేర్లతో కొన్ని స్థిరాస్తులు కొన్నాడు. నిందితుడు సుభాని, అతనికి సహకరించిన కావలికి చెందిన యలసరి బ్రహ్మానందంను కావలి రూరల్‌ పోలీస్‌ స్టేషన సీఐ జి.రాజేశ్వరరావు ఆదివారం రాత్రి గౌరవరం దగ్గర అరెస్టు చేశారు. అతని ఆస్తులకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకొని, బ్యాంకులో ఉన్న నగదు స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. సుభానికి ఇవ్వడం ద్వారా ప్రజలు పోగొట్టుకున్న డబ్బు తాలూకు వివరాలను దర్యాప్తులో తేలుస్తామని డీఎస్పీ తెలిపారు. సుభాని కొనుగోలు అనేక ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు ఇప్పటికే గుర్తించి ఫ్రీజ్‌ చేసినట్లు చెప్పారు.

వీరే సభ్యులు

అనంతార్థ అసోసియేట్స్‌లో సుభానితో పాటు ఈపలపూడి కమలకుమార్‌, చలంచర్ల అనిల్‌, పిల్లి సామ్రాజ్‌ రోమ్డీ చో, యలసిరి బ్రహ్మానందం, గోనె కిరణ్‌, యలసిరి ఆదినారాయణ, తలపల శివశంకర్‌, అద్దూరి శీనయ్య, చౌటూరి అశోక్‌, నిమ్మగడ్డ రాం రాబర్ట్‌ రహీం, కాకిని ప్రశాంతి, వట్టికాల ప్రశాంతి, బుట్టి శివార్జున, కశెట్టి పుష్పలత, జ్యోతి స్రవంతి, గుళ్లమూరి వంశీరెడ్డిలు సభ్యులని డీఎస్పీ వివరించారు. ఈ మనీ స్కాంలో ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్ల భార్యలు ఉన్నారని గుర్తించి వారిని సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. పోలీస్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇలాంటి మనీ స్కాంలో ఉండటం నేరంగా భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పోలీస్‌ కానిస్టేబుళ్లు వట్టికాల రాధాకృష్ణ భార్య వట్టికాల ప్రశాంతి, జ్యోతి అయోధ్య కుమార్‌ భార్య జ్యోతి స్రవంతిలు ఉన్నారని తెలిపారు.

వివరాలు తెలియజేయండి...

సుభాని ద్వారా మోసపోయిన బాధితులు వివరాలు తెలియజేయాలని డీఎస్పీ శ్రీధర్‌ సూచించారు. ఇప్పటి వరకు 150 మంది ఫిర్యాదు అందజేశారని అన్నారు. వారందరి నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని డీఎస్పీ చెప్పారు.

సీజ్‌ చేసిన నగదు, ఆస్తులు

ప్రధాన నిందితుడితోపాటు సభ్యుల బ్యాంక్‌ అకౌంట్‌ల నుంచి రూ.5,35,92,126లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. సుభాన్‌ కుటుంబసభ్యుల పేర్లతో స్థిరాస్తులు రూపేణా ఉన్న రూ.5,74,51,000 విలువ కలిగిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సుభాని నివాసంలో రూ.28,48,600 నగదును సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీతోపాటు కావలి రూరల్‌ సీఐ జి.రాజేశ్వరరావు, వన్‌ టౌన్‌ సీఐ ఎండీ ఫిరోజ్‌, టు టౌన్‌ సీఐ వేల్పుల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

కావలిలో మనీ స్కామ్‌ సూత్రధారి మహబూబ్‌ సుభాని అరెస్ట్‌

అతని ప్రధాన అనుచరుడు కూడా..

బ్యాంక్‌ అకౌంట్లు, నగదు, ఆస్తులు సీజ్‌

వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement