మమ్మల్ని చంపేసి.. భూముల్ని తీసుకోండి
● సమాచారం ఇవ్వకుండా
మా భూముల్లో సర్వేలు చేయడమేంటి
● కావలి ఆర్డీఓకు మొరపెట్టుకున్న
తీర ప్రాంత గ్రామాల రైతులు
కావలి: మా భూముల్లోకి రెవెన్యూ అధికారులు వచ్చి భూములు తీసుకుంటున్నాం, సర్వే చేస్తున్నాం అంటూ హడావుడి చేస్తున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో.. ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారో.. ఇవేవీ మాకు చెప్పడం లేదు. ఇలా చేసే బదులు మమ్మల్ని చంపేసి మా భూములు తీసుకోండి అంటూ కావలి మండలంలోని తీర ప్రాంత గ్రామాలకు చెందిన రైతులు కావలి ఆర్డీఓ ఎం.వంశీకృష్ణ వద్ద ఆవేదన వ్యకం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆర్డీఓను పెద్ద సంఖ్యలో రైతులు కలిశారు. రామాయపట్నం పోర్టుకు సమీపంలో ఉన్న వేలాది ఎకరాలు భూములను సేకరించడానికి కూటమి ప్రభుత్వం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. సాంకేతికంగా మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ జరుగుతున్నా ఈ ప్రక్రియలో కావలి తహసీల్దార్ కింద పని చేసే రెవెన్యూ ఉద్యోగులే క్రియాశీలకంగా ఉంటూ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. భూసేకరణలో ప్రధాన ఘట్టమైన గ్రామసభ నిర్వహించే విషయం రైతులకు తెలియలేదు. దీంతో సోమవారం చెన్నాయపాళెం, పాముగుంటపాళెం, మూలంపేట, పెద్దపట్టపుపాళెం, నందెమ్మపురం, చిన్నపాళెం, పల్లెపాళెం, శ్రీరాంపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆర్డీఓను కలిశారు. ఈ గ్రామాల్లో 3,000 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ భూములతో బతుకుతున్న తాము జోవనోపాధి కోల్పోతే ఎలా బతకాలి? ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ధర ఉన్న భూములకు ఎంతోకొంత నష్ట పరిహారం ఇస్తామని చెప్పడం మమ్మల్ని అవమానపరచడం కాదా? అంటూ రైతులు ప్రశ్నించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్రామసభకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసేలా చేయడంలో పొరపాటు జరిగిందని, అలాంటి పొరపాటు పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. మీరు తెలియజేసిన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment