పరిహారంలో దగా
విజయవాడ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ పరిహారంపై సీతారామపురం మండల రైతులకు కూటమి సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోంది. నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా భూములు లాక్కొంటున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. మా కడుపులు కొట్టొదంటూ రైతులు అధికారులు, కాంట్రాక్టర్లను వేడుకున్నా కనికరించడంలేదు. పచ్చని పైర్లను యంత్రాలతో ధ్వంసం చేసి రోడ్డు పనులు చేపడుతున్నారు.
ఉదయగిరి: సీతారామపురం మండల పరిధిలో జరుగుతున్న ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం.. రైతుల పాలిట శాపంగా మారింది. విలువైన భూములను రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్న క్రమంలో రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సముచిత పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అరకొరగా పరిహారం ఇస్తామంటూ బెదిరించి మరీ స్వాధీనం చేసుకుంటోంది. ఆయా గ్రామాల్లో సేకరిస్తున్న భూములకు ఇచ్చే పరిహారంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే అప్పటి అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కడుపుకొట్టి పచ్చని పంట సాగులో ఉన్న భూములను దౌర్జన్య పూరితంగా స్వాధీనం చేసుకుంటుంది. కనీసం పంట కాలం పూర్తయ్యాక అయినా.. తీసుకుని ప్రాధేయపడుతున్నా.. అధికారులు కనికరించడం లేదు.
పరిహారంలో అన్యాయం
మండలంలో మారుమూల గ్రామాల్లో కూడా ప్రస్తుతం ఎకరా ధర రూ.8 లక్షలు వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల అయితే రూ.15 లక్షలు వరకు కూడా ఉంది. అయితే రైతులకు మాత్రం రూ.4 లక్షలు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా పరిహారం చెల్లింపుల్లో కూడా సమన్యాయం పాటించలేదని, అధికార పార్టీ నేతల మద్దతు ఉన్న వారికి అధికంగా చెల్లింపులు జరిగాయని పలువురు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం రూ.6 లక్షలు అయినా ఇవ్వాలని రైతులు కోరుతున్నా.. పట్టించుకోవడంలేదు.
బలవంతంగా భూములు స్వాధీనం
మండలంలోని మారంరెడ్డిపల్లి, గంధంవారి పల్లి, పబ్బులేటిపల్లి, ఓగూరువారిపల్లి గ్రామాల్లో భూములు సేకరించారు. అయితే పబ్బులేటిపల్లికి చెందిన కొంత మంది రైతులు న్యాయమైన పరిహారం ఇచ్చేంత వరకు తమ భూముల్లో పనులు చేయనీయమని గట్టిగా చెప్పారు. అయితే గత నెల 23న పోలీసులను అడ్డంపెట్టుకుని పంటలు ధ్వంసం చేసి పనులు చేపట్టారు. పొలం చుట్టు రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించుకున్న గోడకు పైసా పరిహారం ఇవ్వకుండా కూల్చేశారు. ఏళ్ల తరబడి పెంచుకున్న టేకుచెట్లకు కూడా పరిహారం ఇవ్వకుండా తొలిగించడంపై రైతులు లబోదిబోమంటున్నారు.
పొలాల్లో నిర్మిస్తున్న రోడ్డు
నామమాత్రపు ధరలతో రైతుల భూముల సేకరణ
బలవంతంగా లాక్కొంటున్న అధికారులు
పరిహారంలో దగా
Comments
Please login to add a commentAdd a comment