కూటమికి కొమ్ముకాస్తే కష్టాలే!
నెల్లూరు(బారకాసు)/వెంకటగిరి (సైదాపురం): ప్రజా సేవే లక్ష్యంగా అధికారులు పని చేయాలని, కూటమి నేతలకు కొమ్ముకాస్తూ.. వారిచ్చే మౌఖిక ఆదేశాలను పాటిస్తే భవిష్యత్‌లో కష్టాలు తప్పవని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పేదలకు న్యాయం చేయాలని, ఇబ్బంది పెట్టేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ కార్యకర్త పేచీరాజ్‌పై గతేడాది డిసెంబర్ 21న అక్రమంగా గంజాయి కేసు బనాయించి జైలుపాలు చేశారని ఆరోపించారు. అయితే పేచీరాజ్ కేసును విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీ సమర్పించాలని పోలీసులను ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు భవిష్యత్‌తో హైకోర్టుకు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వివరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెంకటగిరి సుందరీకరణకు 110 ఎకరాల్లో నగర వనం ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశామని, ప్రస్తుతం ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరవనం ప్రారంభోత్సవంలో శిలాఫలకం విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని, దళితుడైన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తిని అవమానించేలా ఆయన పేరు లేకుండా చేశారని మండి పడ్డారు. ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పేరు కూడా శిలాఫలకంలో లేదన్నారు. దీనిపై స్థానిక జనసేన నేతలు స్పందించాలని సూచించారు. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం తథ్యమని స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికారులు నిబంధనల అమల్లో సాంకేతిక కారణాలను సాకుగా చూపి సరైన విధానాన్ని పాటించలేదన్నారు. మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, చైర్మన్ల మార్పు జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో వెంకటగిరిలో అలాంటి ప్రయత్నం జరిగితే దానిని ఎలా తిప్పి కొట్టాలో తనకు సంపూర్ణ అవగాహన ఉందని, అధికారులు నిబంధనలు విధిగా పాటించాలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్.బాలయ్య, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికష్ణ, బాలాయపల్లి, డక్కిలి మండలాల కన్వీనర్లు వెందోటి కార్తీక్‌రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, కౌన్సిలర్లు ఆటంబాకం శ్రీనివాసులు, సుబ్బారావు, వహిదా, నేతలు అల్లంసాయి, పేచీరాజ్, దశరథరామిరెడ్డి, సతీష్, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
అధికార పార్టీ నేతల మౌఖిక
ఆదేశాలు పాటిస్తే అధికారులకు
ఇబ్బందులు తప్పవు
న్యాయమే గెలిచిందనేందుకు
పేచీరాజ్‌కు బెయిల్ మంజూరే నిదర్శనం
నగరవనం ప్రారంభోత్సవ
శిలాఫలకంలో తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదు
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment