బెట్టింగ్‌ జాడ్యం | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ జాడ్యం

Published Sun, Mar 2 2025 12:02 AM | Last Updated on Sun, Mar 2 2025 12:02 AM

బెట్టింగ్‌ జాడ్యం

బెట్టింగ్‌ జాడ్యం

జిల్లాలో జోరుగా క్రికెట్‌ పందేలు

ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న వైనం

ఉచ్చులోచిక్కుకుంటున్న మహిళలు

అప్పులపాలై దొంగతనాలకు

తాజాగా దొరికిన ఇద్దరు మహిళా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

అయినా దృష్టి సారించని పోలీసులు

ఈమె రమ్మశ్రీ (పేరు మార్చాం). నెల్లూరు కిసాన్‌నగర్‌లో నివాసముంటున్నారు. ప్రభుత్వ వైద్యశాఖ కార్యాలయంలో ఎఫ్‌ఎన్‌ఓగా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం వివాహం జరిగింది. క్రికెట్‌ బెట్టింగ్‌లు, రమ్మీతో పాటు పలు ఆన్‌లైన్‌ గేములు ఆడుతుంది. అంతేకాకుండా పేటీఎం, ఫోన్‌పే తదితర వాటి ద్వారా ఆన్‌లైన్‌లో సుమారు రూ.5 లక్షల వరకు రుణం, అలాగే స్నేహితుల వద్ద మరో రూ.5 లక్షలు అప్పు తీసుకుని ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడుతూ రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు అప్పులపాలైంది. ఈఎంఐలు చెల్లించలేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక కోవూరులో రెండు రోజుల క్రితం చైన్‌ స్నాచింగ్‌ చేస్తూ దొరికిపోయింది.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ మళ్లీ జడలు విప్పుకుంది. ప్రధాన పట్టణాల నుంచి పల్లెల వరకు ఈ జాడ్యం పాకింది. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బుకీలకు కాసులు కురిపిస్తోంది. ప్రజలు బెట్టింగ్‌ ఉచ్చులో పడి చేతులు కాల్చుకుంటున్నారు. ఒకరిద్దరు పందేలు గెల్చుకుంటున్నా, ఓడిపోయేవారే కోకొల్లలు. బెట్టింగ్‌లో సర్వం కోల్పోయి అప్పుల బాధలు తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొందరు నేరాలకు తెగబడుతున్నారు. బెట్టింగ్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

బెట్టింగ్‌ విధానాల్లో మార్పులు

క్రికెట్‌ ఫార్మాట్‌లో వస్తున్న మార్పుల తరహాలోనే బెట్టింగ్‌ విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. గతంలో మ్యాచ్‌ టూ మ్యాచ్‌ మాత్రమే బెట్టింగ్‌లు కాసేవారు. ప్రస్తుతం టాస్‌ ఎవరు గెలుస్తారు? గెలిచిన జట్టు ఎంత స్కోర్‌ చేస్తుంది? ప్రతి బంతికి, ఓవర్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఫలానా బ్యాట్స్‌మెన్‌ ఎన్ని పరుగులు చేస్తారు? బౌలర్‌ ఎన్ని వికెట్లు తీస్తారు? ఇలా ప్రతి అంశంపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్‌లతోనే బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసే వాటి కంటే రెండు, మూడు నిమిషాల ముందుగానే ప్రత్యేక యాప్‌ల్లో మ్యాచ్‌ వివరాలు తెలిసిపోతుండటం గమనార్హం. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్‌లు నేడు గ్రామీణ ప్రాంతాలకు పాకాయి. సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ బుకీలు ఎరవేయడంతో యువత, విద్యార్థులు, కూలీలు, కార్మికులు, వ్యాపారస్తులతో పాటు వివిధ రంగాల్లోని వారు బెట్టింగ్‌ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్‌ వ్యసనాలకు బానిసై రూ.లక్షల్లో అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్‌ల్లో నష్టపోయి అప్పులను తీర్చలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇంకొందరు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చి తిరిగి బెట్టింగ్‌లు కాస్తూనే ఉన్నారు.

ఈమె పేరు జానకి (పేరు మార్చాం). నెల్లూరు మూలాపేటలో నివాసం. కోవూరు మండలంలోని ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కరోనా సమయంలో విజయవాడలోని ఎఫ్‌ఎన్‌ఓ ట్రైనింగ్‌ పూర్తి చేసి 2022లో కోవూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్‌ సోర్సింగ్‌ ఎఫ్‌ఎన్‌ఓగా చేరారు. కరోనా సమయంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో కొందరితో స్నేహం కుదిరి వారి ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు అలవాటు చేసుకుంది. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ

అప్పులు తీర్చేందుకు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

వనంతోపు సెంటర్‌కు చెందిన ఓ యువకుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్‌ మనీతో సరదాగా బెట్టింగ్‌లు కాయడం ప్రారంభించాడు. అది వ్యసనంగా మారిపోవడంతో తెలిసిన వారివద్ద అప్పులు చేశాడు. తల్లిదండ్రులు కొని ఇచ్చిన బైక్‌ను కుదువపెట్టి మరీ బెట్టింగ్‌లు కాశాడు. అందులో నష్టాలు రావడంతో బైక్‌ దొంగతనం జరిగిందని తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు వారు గట్టిగా నిలదీయడంతో బెట్టింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఎక్కడ చూసినా

క్రికెట్‌ పందేలే

చాపకింద నీరులా బెట్టింగ్‌ భూతం విస్తరిస్తూ ప్రజల జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేస్తున్నా పోలీసులు అటువైపుగా దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులకు చిక్కకుండా పకడ్బందీగా క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతోంది. నగరంలోని బార్లు, హోటల్స్‌, అపార్ట్‌మెంట్‌లు, వ్యాపారసంస్థలు ఎక్కడ చూసినా క్రికెట్‌ పందేలే. ఈ జాడ్యం వందలాది కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. మార్చి 9వ తేదీన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగుస్తున్నా.., మార్చి 22 నుంచి మే 25వ తేదీ వరకు ఐపీఎల్‌ జరగనుంది. ఈసీజన్‌లో ఎంతమంది ఆర్థికంగా చితికిపోతారో? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో? ఎన్ని కుటుంబాలు వీధినపడనున్నాయో తలచుకుంటేనే భయం కలుగుతోంది. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

బుచ్చిరెడ్డిపాళెం చెందిన శ్రీనివాసులు బెట్టింగ్‌ల్లో నష్టపోయాడు. బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిడితో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న అతని భార్య యాసిడ్‌ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని బెట్టింగ్‌ భూతం కబళించింది. ఇలా జిల్లాలో అనేకమంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఉదాహరణలు ఇవిగో..

నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు సులువుగా డబ్బు సంపాదించాలని బెట్టింగ్‌లు ఎంచుకున్నారు. చిన్న చిన్న మొత్తాలతో పందేలు కాయడం.. వారు ఎంచుకున్న జట్లు గెలుపొందడంతో డబ్చు వచ్చింది. దీంతో తమ తాహతుకు మించి అప్పులు చేసి మరీ రూ.లక్షల్లో బెట్టింగ్‌లు కాశారు. కథ అడ్డం తిరగడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి బైక్‌ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement