
కనిపించిన ‘నెలవంక’
● పవిత్ర రంజాన్ మాసం ఆరంభం
● సంబరాలు చేసుకున్న ముస్లింలు
నెల్లూరు(బృందావనం): ఆకాశంలో శనివారం సాయం సంధ్యవేళ నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ఆరంభమైంది. నెలవంకను వీక్షించిన అనంతరం మతపెద్దల సూచనలతో ముస్లింలు రాత్రి 8.45 గంటలకు తరావీనమాజు ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ‘దువా’ (ప్రార్థన) చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ‘రంజాన్’ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. రంజాన్ మాసంలో నెల రోజులపాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆథ్యాత్మిక చింతనతో గడుపుతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సంప్రదాయంగా నియమ నిబంధనలను పాటిస్తూ కఠోర ఉపవాసంతో దీక్షలో ఉంటారు. ప్రతి రోజు వేకువజామున ‘సహరి’తో ఉపవాసం ఆరంభించి సాయంత్రం సంధ్యవేళ ‘ఇఫ్తారి’తో ఉపవాసం దీక్ష విరమణ పరిపాటి.
ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు
వేయకపోతే కఠిన చర్యలు
● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి
నెల్లూరు(అర్బన్): ముఖ ఆధారిత హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) వేయని వైద్యశాఖ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి పేర్కొన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఆమె శనివారం నగరంలోని వైద్యశాఖ కార్యాలయంలోని డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల్లో సమయపాలన పాటించని వారిపైన కూడా చర్యలు తప్పవన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి వారు విధులు నిర్వర్తించే ప్రాంతంలోనే తప్పనిసరిగా నివాసముండాలని సూచించారు. ఐపీ, ఓపీ, ఆస్పత్రులలో ప్రసవాలు, ల్యాబ్ టెస్ట్‌లు, ఐయుసీడీల ఆధారంగా సీహెచ్‌సీలకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నామన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఖాదర్‌వలి, డీఐఓ డా.ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
నుడా ఆధ్వర్యంలో
అభివృద్ధి పనులు
● జిల్లా కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(బారకాసు): నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ నుడా కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. శనివారం వేదాయపాలెం గాంధీనగర్‌లోని కార్యాలయంలో నుడా అథారిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్ సూర్యతేజ, అథారిటీ సభ్యులు హాజరయ్యారు. నుడా కార్యకలాపాల కోసం సిబ్బంది నియామకం, లేఅవుట్ల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు అజెండాలో ప్రధాన అంశాలుగా పొందుపరిచారు. పలు అంశాలను సభ్యుల సమక్షంలో కలెక్టర్ సమీక్షించి ఆమోదించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాలు, పంచాయతీల్లో నుడా ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి తక్కువ ధరకు ఇంటి స్థలాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వైస్‌చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ నుడా ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు దేశ్‌నాయక్, గంగాధర్, పరిశ్రమల శాఖ జీఎం ప్రసాద్, ఆర్డీఓ వంశీకృష్ణ, ముఖ్య ప్రణాళికాధికారి కె హిమబిందు, నుడా సెక్రటరీ పెంచలరెడ్డి, ప్రణాళికాధికారి ఎం హిమబిందు పాల్గొన్నారు.

కనిపించిన ‘నెలవంక’
Comments
Please login to add a commentAdd a comment