పెత్తనం నీదా.. నాదా..?
సైదాపురం మండలంలోని గనుల కోసం కూటమి నేతలు కొట్లాడుకుంటున్నారు. ప్రధానంగా శ్రీనివాసా పద్మావతి మైన్‌ను సొంత చేసుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపారు. నెల్లూరుకు చెందిన ఓ ముఖ్యనేత ఆధిపత్యాన్ని సహించలేని స్థానిక ప్రజాప్రతినిధి మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్.. రెవెన్యూ అధికారులను ఆదివారం రంగంలోకి దించారు. అయితే సదరు ముఖ్యనేత జోక్యం చేసుకోవడంతో చేసేదిలేక చేతులెత్తేశారు. తూతూమంత్రంగా చర్యలు చేపట్టి ముఖం చాటేశారు.
మైనింగ్‌కు అనుమతి లేదు
శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులొచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించాం. ఇక్కడ కేవలం పంపింగ్‌ను మాత్రమే చేస్తున్నారు. ఖనిజాన్ని తరలించేందుకే అనుమతి ఉంది. మైనింగ్‌కు లేదు.
– రమాదేవి, తహసీల్దార్, సైదాపురం
ఫిర్యాదు అందలేదు
శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు చేపడతాం. ఇక్కడ వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు.
– క్రాంతికుమార్, ఎస్సై, సైదాపురం
●
శ్రీనివాసా పద్మావతి గని కోసం కూటమి నేతల ఘర్షణ
● సిండికేట్‌కు వ్యతిరేకంగా
స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలు
● ముఖ్యనేత జోక్యంతో
తలలు పట్టుకుంటున్న అధికారులు
సైదాపురం: మండలంలోని రామసాగరం, సైదాపురం గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూమిని శ్రీనివాసా పద్మావతి గనికి గతంలో కేటాయించారు. 2019లోనే లీజు కాలపరిమితి ముగియడంతో అది కాస్తా మూతపడింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వమొచ్చిన అనంతరం దానిపై పలువురు నేతల కన్నుపడింది. ఎలాంటి అనుమతుల్లేకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో మైనింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో రామసాగరం గ్రామస్తులు కొందరు అక్రమ మైనింగ్‌ను ఆదివారం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మైనింగ్ సిండికేట్‌కు చెందిన వ్యక్తులు తమకు అధికార పార్టీ ఎంపీ, మరో నాయకుడి మద్దతు ఉందంటూ గ్రామస్తులను బెదిరించి తరిమేశారు.
ప్రజాప్రతినిధి ఆగ్రహం
మైనింగ్ సిండికేట్ దౌర్జన్యాలపై రామసాగరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ఫోన్ చేసి మైనింగ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మైన్ వద్దకు వచ్చిన పోలీసులు ఎనిమిది మోటార్‌సైకిళ్లు, ఓ ఎస్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. తదనంతరం ఏమి జరిగిందో గానీ.. పోలీసులు సీజ్ చేసి వాహనాలు స్టేషన్ ఆవరణ నుంచి వెళ్లిపోయాయి. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ రమాదేవి, ఎస్సై క్రాంతికుమార్ హుటాహుటిన శ్రీనివాసా పద్మావతి గని వద్దకు చేరుకొని, అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టారు.
అనుమతుతెలా..?
శ్రీనివాసా పద్మావతి గనిలో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తును జనవరిలో తిరస్కరించారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ నెల గడవక ముందే సదరు గనిలో 1.5 లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వుకొని తరలించుకునేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ గనిపై కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం.
పెత్తనం నీదా.. నాదా..?
Comments
Please login to add a commentAdd a comment