చూస్తే.. కన్నీరే..! | - | Sakshi
Sakshi News home page

చూస్తే.. కన్నీరే..!

Published Mon, Mar 3 2025 12:02 AM | Last Updated on Mon, Mar 3 2025 12:04 AM

చూస్త

చూస్తే.. కన్నీరే..!

● స్వస్థత కోసం ఏఎస్‌పేట దర్గాకు మతిస్థిమితం లేని వారు
దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన దర్గాల్లో ఏఎస్‌పేటలోని హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ దర్గా ఒకటి. దీని దర్శనార్థం దేశ, విదేశాలకు చెందిన ఎంతో మంది భక్తులు వస్తుంటారు. స్వస్థత నిమిత్తం మతిస్థిమితం లేని వారిని ఇక్కడికి తీసుకొస్తే ఆ సమస్య నయమవుతుందనేది ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతో పలువుర్ని ఈ ప్రాంతంలో వదిలేసి కుటుంబసభ్యులు వెళ్తుంటారు. ఈ అవకాశాన్నే సంరక్షకులు చక్కగా క్యాష్‌ చేసుకుంటున్నారు. మానసిక వ్యాధిగ్రస్తులను చైన్లతో కట్టి.. వేధింపులకు పాల్పడుతూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పర్యవేక్షణలేక కొందరు అటవీ ప్రాంతంవైపు వెళ్లి మృత్యువాత పడుతున్న ఘటనలూ ఉన్నాయి.

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు. మానసిక రోగైన మస్తాన్‌ను కుటుంబసభ్యులు ఏఎస్‌పేటలోని ఓ కేర్‌ టేకర్‌ వద్ద మూడు నెలల క్రితం వదిలారు. ఆయనకు తోడుగా సోదరి ఉంటున్నారు. ఆమైపె కన్నేసిన కేర్‌ టేకర్‌ షరీఫ్‌ ఎలాగైనా లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో మస్తాన్‌ను ఓ గదిలో మూడు రోజుల క్రితం బంధించి కొట్టారు. తనకు సహకరించకపోతే సోదరుడ్ని చంపేస్తానంటూ ఆమెను బెదిరించారు. అంతటితో ఆగకుండా గదిలోకి లాక్కెళ్లి చేయి చేసుకున్నారు. తప్పించుకున్న ఆమె.. ఏఎస్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షరీఫ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గొలుసుతో అమానవీయంగా బంధించి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఏఎస్‌పేటలోని హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ దర్గా భక్తుల విశ్వాసానికి ప్రతీక. దీన్ని దర్శించుకుంటే తమ మొక్కులు తీరుతాయనే నమ్మకం చాలా మందిలో బలంగా నాటుకుంది. మతిస్థిమితం లేని వారిని ఇక్కడ కొంతకాలం ఉంచితే నయమవుతుందనే భావనా ఉంది. దీంతో వీరిని ఇక్కడి సంరక్షణ కేంద్రాల్లో కుటుంబసభ్యులే వదిలేసి వెళ్తారు. వీరి సంరక్షణ నిమిత్తం ఒక్కో కేంద్రానికి ఒక్కో కేర్‌ టేకర్‌ ఉంటారు.

సంరక్షకులే.. భక్షకులు

కేర్‌ టేకర్‌ ముసుగులో మానసిక రోగులను సంరక్షకులు వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ మహిళపై కేర్‌ టేకర్‌ షరీఫ్‌ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఇలాంటి ఘటనలు జరిగినా బయటి ప్రపంచానికి చెప్పుకోలేక మరింతగా కుంగిపోతున్నారు. ఏఎస్‌పేటలో దాదాపు ఐదుగురు కేర్‌ టేకర్లుండగా, ఒక్కో కేంద్రంలో 50 నుంచి 70 మంది వరకు మానసిక రోగులు ఉంటున్నారు.

నగదు ఇవ్వకపోతే.. గెంటివేతే

ఇక్కడ ఉండే వారికి నిత్యం అన్నం పెడతారు. చేయిచాస్తే దయార్థులిచ్చే చిల్లరతో టీ, కాఫీలు సేవిస్తుంటారు. వసతిగృహాల్లోని గదులు దుర్భరంగా దర్శనమిస్తాయి. పరిశుభ్రత కానరాదు. కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనూ సంకెళ్లు తీయని ఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెలవారీగా కుటుంబసభ్యుల నుంచి నగదును మాత్రం తెప్పించుకుంటారు. ఒకవేళ జాప్యం జరిగితే వసతిగృహం నుంచి గెంటేస్తారు.

నమ్మకమే.. గేట్‌ వే..!

ఏఎస్‌పేట దర్గాలో తిరిగే మానసిక రోగుల ఆరోగ్యం కుదుటపడిన ఉదంతాలూ చాలానే ఉన్నాయి. నెలల వ్యవధిలోనే సాధారణ స్థితికొచ్చి తిరిగి స్వస్థలాలకు వెళ్తుండటంతో ఇది మానసిక రోగులకు నిలయంగా మారింది. వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోతే దర్గా పరిసర ప్రాంతాల్లో వదిలేస్తే దైవమే నయం చేస్తుందనే నమ్మకం ఉంది. దీంతో చాలా మందిని ఇక్కడ వదిలి వెళ్తుంటారు.

క్షుద్బాధతో మృత్యువాత

పేద మానసిక రోగులకు ప్రత్యేక వసతి గృహాల్లో స్థానం ఉండదు. దీంతో దేవుడిపై కుటుంబసభ్యులు భారమేసి బయటే వదిలి వెళ్తున్నారు. పర్యవేక్షణ లేక వీరు అడవిబాట పడుతున్నారు. అలా వెళ్లిన వారు రోజుల తరబడి అక్కడే ఉంటూ ఆకలితో అలమటించి, తాగునీరు దొరక్క మృత్యువాత పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఐదేళ్లలో ఈ తరహాలో దాదాపు పది మంది వరకు మృత్యువాత పడ్డారని తెలిసింది. ఇలాంటి ఘటనల్లో కుటుంబసభ్యులకు సమాచారమిచ్చే పరిస్థితీ ఉండదు. గుర్తుతెలియని మృతదేహాలుగా పోలీసులు కేసు నమోదు చేసి అక్కడే అంత్యక్రియలు చేయించాల్సి వస్తోంది.

ఓ ఇంట్లో మానసిక రోగులు

ఏఎస్‌పేట దర్గాలో మానసిక రోగుల కోసం ప్రత్యేక వసతి గృహాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దర్గా ప్రస్తుతం వక్ఫ్‌ బోర్డు ఆధీనంలో ఉంది. దీని నిర్వహణపై ఎన్నో ఫిర్యాదులూ వెళ్లాయి. వసతుల ఏ ర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్న తీరు ను తప్పుబడుతున్నారు.

అక్కడే వదిలేస్తున్న కుటుంబసభ్యులు

చుట్టూ తిరిగితే వ్యాధి తగ్గుతుందనే నమ్మకం

అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న సంరక్షకులు

చైన్లతో కట్టి.. ఆపై హింసిస్తూ..

పర్యవేక్షణ లేక అటవీ ప్రాంతం వైపు వెళ్లి మృత్యువాత

మానసిక రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. కాళ్లు, చేతులకు సంకెళ్లేసి వదిలేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వీటితోనే నడవాల్సి ఉంటుంది. వారికంటూ ప్రత్యేక చికిత్సే ఉండదు. ఏఎస్‌పేట దర్గా పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 మంది వరకు మానసిక రోగులున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేట్‌ వ్యక్తులు ఏర్పాటు చేసిన వసతి గృహాల్లోనే ఉంటున్నారు. పర్యవేక్షకులు మాత్రం వీరిని సాటి మనుషులుగా పరిగణించరు. ఎదురుతిరిగితే కర్రతో చావబాదుతారు. దీంతో వీరి శరీరం నిండా దెబ్బలే కనిపిస్తాయి. భయపడి పర్యవేక్షకులు చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తోంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు కొద్ది నెలలుగా కేర్‌టేకర్‌ షరీఫ్‌ వద్ద ఉంటున్నారు. వీళ్లను బేల్దారీ పనులకు పంపిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. మానసిక రోగులనే కనికరం లేకుండా కర్రతో కొడుతూ వికృతానందం పొందుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేలను కుటుంబసభ్యుల వద్ద వసూలు చేస్తుంటారు. వీరిని వివిధ పనులకు పంపిస్తూ కూలి డబ్బులనూ కొల్లగొడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చూస్తే.. కన్నీరే..! 
1
1/5

చూస్తే.. కన్నీరే..!

చూస్తే.. కన్నీరే..! 
2
2/5

చూస్తే.. కన్నీరే..!

చూస్తే.. కన్నీరే..! 
3
3/5

చూస్తే.. కన్నీరే..!

చూస్తే.. కన్నీరే..! 
4
4/5

చూస్తే.. కన్నీరే..!

చూస్తే.. కన్నీరే..! 
5
5/5

చూస్తే.. కన్నీరే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement