హైలెవల్ కాలువను వెంటనే నిర్మించాలి
మర్రిపాడు: సోమశిల హైలెవల్ కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలంటూ మర్రిపాడులో రైతు సదస్సును సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడారు. మెట్ట ప్రాంత తాగు, సాగునీటి అవసరాల కోసం నిర్మించనున్న దీన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేలా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవ చూపాలని కోరారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ్ని ఈ నెల ఐదున కలవనున్నామన్నారు. నేతలు మూలె వెంగయ్య, నాగయ్య, లక్కు ప్రసాద్, చండ్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఏడు నెలల పాపతో
తల్లి ఆత్మహత్యాయత్నం
● రక్షించిన పోలీసులు
నెల్లూరు(క్రైమ్): కుటుంబకలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత తన ఏడు నెలల కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని రక్షించారు. వివరాలు.. చింతారెడ్డిపాళేనికి చెందిన నితిన్, జాస్మిన్ గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడు నెలల పాప ఉంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో జాస్మిన్ తన పాపతో కలిసి ఇంటి నుంచి శనివారం రాత్రి బయటకొచ్చారు. సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాల వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, అటుగా వెళ్తున్న హరీష్.. 112కు సమాచారం అందించారు. చిన్నబజార్ ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు ప్రభు కిరణ్, పుల్లయ్య హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని తల్లీకుమార్తెను రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇన్‌స్పెక్టర్ అందించారు. అనంతరం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పంపారు. బాధితురాలి కుటుంబసభ్యులకు రూరల్ ఇన్‌స్పెక్టర్ వేణు కౌన్సెలింగ్ చేసి వీరిని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment