కందుకూరు రూరల్: కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, పరీక్ష కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ నాగూర్‌వలీ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయలేదు. ఉన్నతాధికారుల సూచనలను సైతం లెక్క చేయకుండా.. పరీక్షకు విద్యార్థినిని దూరం చేశారు.
జరిగిందిదీ..
టీఆర్‌ఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ సబ్జెక్టులకు పరీక్షను జరపాలి. అయితే ప్రతిభ కళాశాలకు చెందిన ఇంద్రకంటి శరణ్య సంస్కృతాన్ని చదివినా, ఆమెకు ఇచ్చిన హాల్‌టికెట్లో తెలుగు సబ్జెక్టుగా ముద్రించారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేంత వరకు ఈ అంశాన్ని విద్యార్థిని గమనించలేదు. తీరా తెలుగు ప్రశ్నపత్రాన్నిచ్చారు. అయితే తాను చదివింది సంస్కృతమని, ఆ ప్రశ్నపత్రాన్నే ఇవ్వాలని కోరారు. కాగా హాల్‌టికెట్లో ఏ సబ్జెక్టుంటే దాన్నే ఇస్తామని ఖరాఖండీగా చెప్పడంతో మూడు గంటల పాటు పరీక్ష రాయకుండా విద్యార్థిని కూర్చుండిపోయారు.
ఆదేశాలు బేఖాతర్
హాల్‌టికెట్లలోని సబ్జెక్టుల్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే ముందే మార్చుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఒకవేళ పొరపాటు జరిగితే విద్యార్థి ఏ పరీక్ష రాస్తారో అదే ప్రశ్నపత్రాన్ని ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా చీఫ్ నాగూర్‌వలీ వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థినిని పరీక్షకు దూరం చేశారు. కాగా ఈ అంశమై ఆర్‌ఐఓ శ్రీనివాసులును సంప్రదించగా, విద్యార్థినిని పరీక్ష రాయనీయకపోవడం పొరపాటేనని, దీనిపై విచారణ జరుపుతామని బదులిచ్చారు.
ఇంటర్ పరీక్షలో చేదు అనుభవం
చదివింది సంస్కృతం..
కానీ హాల్‌టికెట్లో తెలుగుగా ముద్రణ
అందులో ఏది ఉంటే
అదే రాయాలని ఆదేశం
చివరికి ఎగ్జామ్ రాయకుండానే వెనుదిరిగి
Comments
Please login to add a commentAdd a comment