అరాచకాలకు అడ్డొస్తే కక్షసాధింపే
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నేతల కక్షసాధింపులు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. తమకు అడ్డొచ్చినా.. ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారు. వీరిపై అధికారులను ఉసిగొల్పి ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది.
నోటీసులివ్వకుండానే..
రూరల్ మండలంలోని ఆమంచర్ల బిట్ – 2 ఎంపీటీసీ సురేంద్రరెడ్డికి చెందిన స్థల హద్దు కంచెను ఎలాంటి నోటీసులివ్వకుండానే రెవెన్యూ అధికారులు తొలగించారు. వాస్తవానికి అప్పయ్యకండ్రిగలోని పడమర వీధిలో ఎంపీటీసీ చింతా సురేంద్రరెడ్డికి 50 అంకణాల స్ధలం ఉంది. తాతల నాటి నుంచే ఇది సంక్రమించింది. అక్కడ దశాబ్దాలుగా ఉన్న చిన్న ఇల్లు పాతబడటంతో కొన్నేళ్ల క్రితం తొలగించారు. స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో చుట్టూ కంచె వేశారు.
పచ్చ నేతల సూచనలతోనే..
స్థలం వద్దకు స్థానిక సర్వేయర్, వీఆర్వో శనివారం చేరుకొని, టీడీపీ నేత వేణుకు సంబంధించిన జేసీబీని తీసుకొచ్చారు. రూరల్‌లోని ఓ టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతో స్థలం చుట్టూ ఉండే కంచెను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఎంపీటీసీ కుమారుడు మస్తాన్‌రెడ్డి అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించగా, తామేమీ చేయలేమని, టీడీపీ పెద్దల సూచనలతోనే వచ్చామని బదులిచ్చారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే కంచెను జేసీబీతో తొలగించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా పచ్చ నేతలను కలవాలని సూచించి, అధికారులు నిష్క్రమించారు.
బాధితులకు అండగా
నిలిచినందుకే..
ఆమంచర్లలోని 23 కుటుంబాలకు సంబంధించిన భూమిని టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో పేదలకు ఎంపీటీసీ సభ్యుడు అండగా నిలిచారు. సమస్యను కలెక్టర్ దృష్టికీ తీసుకెళ్లారు. దీంతో కక్ష పెంచుకున్న వారు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పొరంబోకు స్థలమంటూ కంచె తొలగింపు చర్యలకు అధికారులు పూనుకున్నారు. ఇలా వ్యవహరించడం దారుణమని సురేంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీటీసీ సభ్యుడి స్థల హద్దు
కంచె తొలగింపు
టీడీపీ ముఖ్యనేత ఆదేశాలకు
అధికారుల జీహుజూర్
మూడు తరాలుగా
అక్కడే నివాసం ఉన్న కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment