
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసి రాత్రికి రాత్రే పెద్ద యంత్రాలతో చదును చేసి రూపురేఖలు మార్చేస్తున్నారు. తాజాగా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ అనుపల్లిపాడు వద్ద రూ.2 కోట్ల విలువైన సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు దర్జాగా కబ్జా చేయడంపై నాలుగు గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిధిలో అనుపల్లిపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారికి ఆనుకుని విలువైన ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. టీడీపీ నాయకులు నాలుగు రోజుల క్రితం యంత్రాలతో సదరు భూమిని, దానికి అనుకుని ఉన్న దశాబ్దాల క్రితం తవ్విన పంట కాలువను పూడ్చి చదును చేశారు. పంట కాలువ రూపురేఖలు లేకుండా చేశారు. సుమారు మూడెకరాలను కబ్జా చేసేశారు. ఆక్రమణలకు గురైన ఈ భూమి జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎకరా పొలం ధర రూ.70 లక్షలు ఉంటుందని రైతులు చెబుతున్నారు. టీడీపీ నాయకులు కబ్జా చేసిన పంట కాలువ ద్వారానే అనుపల్లిపాడు, నాయుడుపాళెం, జంగాలపల్లి, రామదాసుకండ్రిగ గ్రామాల రైతులకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. కబ్జా విషయం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకుని ఆక్రమణదారులతో వాగ్వాదానికి దిగారు. నాలుగు గ్రామాలకు సాగునీరు విడుదల చేసే కాలువను ఎలా పూడ్చివేస్తారని ప్రశ్నించినా వారు లెక్కచేయకుండా పనులు కొనసాగించారు.
పట్టించుకోని అఽధికారులు?
పంట కాలువను కబ్జా చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ కాలువను పూడ్చివేస్తే తమ పొలాలు బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, వెంటనే ఆక్రమణలు తొలగించి, పంట కాలువను యథావిధిగా ఉంచాలని ఫిర్యాదు చేశారు. అయితే ఏ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ పెద్దల సహకారంతోనే పంట కాలువను కబ్జా చేసి చదును చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాఽఽధికారులు జోక్యం చేసుకోవాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమితోపాటు పంట కాలువ ఆక్రమణ
నాలుగు గ్రామాల రైతుల ఆగ్రహం
ఫిర్యాదు చేసినా పట్టించుకోని
ఇరిగేషన్ అధికారులు

దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
Comments
Please login to add a commentAdd a comment