నెల్లూరు(క్రైమ్): కారు మితిమీరిన వేగంతో రోడ్డుపక్కనే ఉన్న తోపుడు బండ్లు, స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటన నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. కస్తూరిదేవి గార్డెన్స్ ఎదురు ఖాళీ స్థలం వద్ద రోడ్డుమార్జిన్‌లో తోపుడు బండ్లపై కొందరు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఫత్తేఖాన్‌పేట నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వైపు కారు మితిమీరిన వేగంతో వస్తూ రెండు పండ్ల బండ్లను, ఒక స్కూటీని ఢీకొట్టి ఆగిపోయింది. వ్యాపారులు, స్కూటీ యజమాని సకాలంలో పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారు ముందుబాగం దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
తల్లీబిడ్డల అదృశ్యం
ముత్తుకూరు: భర్త వైఖరితో మనస్తాపం చెందిన ఓ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని అదృశ్యమైన ఘటన కృష్ణపట్నం పంచాయతీలో జరిగింది. ఆదివారం కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. ఆర్కాట్‌పాళేనికి చెందిన సురేష్, పామంజి కల్యాణి దంపతులకు లీలా మనోహర్, భార్గవ్ అనే పిల్లలున్నారు. సురేష్ నిరుద్యోగిగా ఉండటం భార్యకు నచ్చలేదు. పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుతో భర్త ద్వారా రొయ్యల పెంపకం చేయాలనుకుంది. కాగా అందులో సగం డబ్బు ఖర్చు కావడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. భర్తపై అలిగి ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం కల్యాణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సురేష్ గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులో యువతి
నెల్లూరు(క్రైమ్): ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు బయోడేటా తయారు చేసుకుని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల కథనం మేరకు.. గుప్తా పార్కు ప్రాంతానికి చెందిన యువతి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. బయోడేటా తయారు చేసుకునేందుకు గాంధీబొమ్మ సెంటర్‌కు వెళ్తున్నానని ఆమె ఆదివారం కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తిరిగి రాకపోవడంతో కుటుంబం గాలించింది. ఆచూకీ తెలియకపోడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment