వీఆర్వో, సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వీఆర్వో, సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలి

Published Mon, Mar 3 2025 11:59 PM | Last Updated on Mon, Mar 3 2025 11:59 PM

వీఆర్వో, సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలి

వీఆర్వో, సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలి

వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్‌

సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి

నెల్లూరు సిటీ: ఉన్నతాధికారులకు సమాచారం కూడా ఇవ్వకుండా టీడీపీ నాయకుల ఆదేశాలతో ఆమంచర్ల బిట్‌–2 ఎంపీటీసీ సభ్యుడు సురేంద్రరెడ్డికి చెందిన స్థలం హద్దు కంచెను తొలగించిన వీఆర్వో, సచివాలయ సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ లాజరస్‌కు సోమవారం అప్పయ్యకండ్రిగ గ్రామస్తులు, సురేంద్రరెడ్డితో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అప్పయ్యకండ్రిగలోని పడమరవీధిలో సురేంద్రరెడ్డికి చెందిన పూర్వీకుల స్థలం చుట్టూ ఉన్న హద్దు కంచెను వీఆర్వో, సచివాలయ సర్వేయర్‌లు జేసీబీతో తొలగించారన్నారు. గ్రామస్తులు ప్రశ్నించగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. ఈ క్రమంలో తాను రూరల్‌ సీఐకి ఫోన్‌ చేసి లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వస్తుందని, చర్యలు తీసుకోవాలని చెప్పానన్నారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్తే తాము ఆదేశాలివ్వలేదని చెప్పారన్నారు. టీడీపీ నాయకుల ఆదేశాలతో కంచె తొలగించారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. బాధితుడిపైనే జేసీబీ నిర్వాహకుడు తప్పు డు కేసు పెట్టారన్నారు. సురేంద్రరెడ్డి ఆమంచర్లలోని 23 కుటుంబాలకు న్యాయం చేసేందుకు ముందుకు రావడమే చేసిన తప్పా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్‌ మండలాధ్యక్షుడు పుచ్చలపల్లి రాంప్రసాద్‌రెడ్డి, నాయకులు శివాజీ, వెంకటసుబ్బారెడ్డి, రఘురామ్‌రెడ్డి, సుమన్‌రెడ్డి, సింహాద్రి, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో

సీనియారిటీ జాబితా

నెల్లూరు(టౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీ పరిధిలోని స్కూళ్లలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ ఆర్‌.బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దానిపై అభ్యంతరాలుంటే మంగళవారం నుంచి 10వ తేదీ లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖ, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పాఠశాల విద్యాశాఖకు సమర్పించాలన్నారు. అభ్యంతరాలను ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయాన్ని తెలియజేస్తుందన్నారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

లైంగికదాడి కేసులో

ఒకరికి పదేళ్ల జైలు

నెల్లూరు(లీగల్‌): బాలికను కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి పాల్పడినట్టు నమోదైన కేసులో దేవరకొండ విజయకుమార్‌ అనే వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష, రూ.22 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. జలదంకి ప్రాంతానికి చెందిన ఓ బాలిక 2017లో బ్రాహ్మణక్రాక గ్రామంలోని బంధువులు ఇంటికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన విజయకుమార్‌ ప్రేమ పేరుతో నమ్మించి బాలికను కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తాత ఫిర్యాదు మేరకు జలదంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిపై కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

గుర్తుతెలియని

మృతదేహాలు లభ్యం

వెంకటాచలం: మండలంలోని జోసఫ్‌పేట గ్రామ సమీపంలో సర్వేపల్లి రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. గత నెల 20వ తేదీన గొలగమూడి సమీపంలో సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహం జోసఫ్‌పేట వద్ద రిజర్వాయర్‌ కట్ట అంచుకు రావడంతో స్థానికులు చూసి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

అల్లూరు కాలువలో..

కొడవలూరు: మండలంలోని గండవరం సమీపంలోని అల్లూరు కాలువలో సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సీహెచ్‌ కోటిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ వ్యక్తి చనిపోయి మూడురోజులై ఉండొచ్చని భావిస్తున్నారు. బ్లూ కలర్‌ కాటన్‌ చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. మద్యం బాటిల్‌ ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఉదయకళేశ్వరుని తిరునాళ్లకు వచ్చి బహిర్భూమి నిమిత్తం కాలువ వద్దకు వెళ్లి మద్యం మత్తులో కాలువలో పడి మృతిచెంది ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement