ఆరుగురు ‘తెలుగు తమ్ముళ్ల’పై కేసు●
● స్కూల్ వార్షికోత్సవంలో
బీభత్సం చేసిన ఘటనలో..
తోటపల్లిగూడూరు: ఓ పాఠశాల వార్షికోత్సవంలో పచ్చమూక సృష్టించిన బీభత్సంపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదైంది. వివరాలు.. మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి పూజ, వార్షికోత్సవం జరిగింది. దీనికి వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు మద్యం తాగొచ్చి బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. డీజే సిస్టం నిర్వాహకులైన వంశీ (పల్లిపాడు), విక్రమ్ (విలుకానుపల్లి)పై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. అంతే కాకుండా డీజే సిస్టంకు సంబంధించిన మిక్సర్, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బాధితులైన వంశీ, విక్రమ్‌లు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, మహేష్, చందు, విజయ్, కిరణ్‌తో పాటు మరికొందరు అకారణంగా దాడి చేసి, డీజే సిస్టం సామగ్రిని ధ్వంసం చేశారని, సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment