బీపీటీ రకాన్ని కేంద్రాల్లోనే విక్రయించుకోండి
● డీఏఓ పి.సత్యవాణి సూచన
కొడవలూరు: బీపీటీ రకం ధాన్యాన్ని మార్కెట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున, దానిని రైతులు విధిగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిని పి.సత్యవాణి సూచించారు. మండలంలోని గుండాలమ్మపాళెం, వెంకన్నపురం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీటీ రకానికి ప్రభుత్వం పుట్టికి రూ.19,720 మద్దతు ధర ప్రకటించిందని, మార్కెట్‌లో రూ.17,500లకే కొంటున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుని అధిక ధర పొందాలన్నారు. తేమ శాతంలోనూ మినహాయింపు ఉన్నందున రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం అధికంగా ఉంటే అదనంగా ఉన్న ఒక్కో శాతానికి క్వింటాకు కిలో ధాన్యం వంతున అదనంగా కేంద్రాలకు ఇవ్వడం ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రధానంగా వరికోత కోసే రైతులు వారం ముందుగానే వీఏఏను సంప్రదించి షెడ్యూలింగ్ నమోదు చేసుకోవాలన్నారు. దీంతో కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, మిల్లుల కేటాయింపు, వాహనాలు సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆమె పంట నమోదైన రైతుల వివరాలను కేంద్రాల వద్ద ప్రచురించారు. కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శేషగిరిరావు, ఏఓ లక్ష్మి, ఏఈఓ పి.వెంకట్రావు, వీఏఏలు కె.విష్ణుప్రియ, బి.లిఖిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment