అమాంతం పెరిగిన నిమ్మ ధరలు
● బస్తా రూ.8 వేలు
పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డులో రెండు రోజుల్లో నిమ్మ ధరలు అమాంతం పెరిగాయి. బస్తా (లూజు) కాయల ధర రూ.8 వేలకు పలికింది. కిలోల వంతున చూసుకుంటే రూ.70 నుంచి రూ.110 వరకు ధరలున్నట్టు వ్యాపారులు వెల్లడించారు. దీంతో రైతుల్లో సంతోషం నెలకొంది. అయితే అందరి తోటలు కాయల్లేవు. ఉన్న రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నిమ్మ వినియోగం ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో నిమ్మ మార్కెట్ ధరలు నిలకడగా ఉండవు. ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి పెరిగితే ఇక్కడ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది.
ఈ కేవైసీకి రేపటి వరకు గడువు
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని రైతులు ఈ–కేవైసీ, ఈ–క్రాప్ నమోదు చేయించుకునేందుకు ఈనెల 6వ తేదీ వరకే గడువు ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమోదు చేసుకున్న రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయం చేసుకోవచ్చన్నారు. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు నమోదు చేసుకున్న రైతుల వివరాలు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారన్నారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
● జడ్జి కరుణకుమార్
నెల్లూరు(టౌన్): న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్ ఆకాక్షించారు. నెల్లూరు బీవీనగర్‌లోని ఆర్‌వీఎస్ కల్యాణ మండపంలో వీఆర్ న్యాయ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ లా విద్యార్థులకు జ్ఞాపికలు అందించి ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరుణకుమార్ మాట్లాడుతూ పక్షపాతం లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ సింధుప్రియ, అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ చీఫ్ జనరల్ సెక్రటరీ ఇంతియాజ్, లా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment