ఈ ఘటనలకు బాధ్యులెవరు?
మిల్లర్‌కు ధాన్యం అమ్మిన 250 మంది రైతులు
● ఇవ్వాల్సిన బాకీ రూ.5.60 కోట్లు
● ఏడాదిగా అడుగుతున్నా దిక్కులేదు
● మిల్లు ఎదుట ఆందోళనకు దిగిన అన్నదాతలు
నెల్లూరు (పొగతోట):
‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు
మచ్చుకై నా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ ఉన్నాడో కాని కంటికి కానరాడు..’ అంటూ ఓ కవి రచన ‘అన్నదాతలకు అచ్చు గుద్దినట్లు సరిపోతోంది. స్వార్ధ పూరిత పాలకులు, మిల్లర్ల దోపిడీ దాష్టీకానికి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. నెల్లూరుకు చెందిన శేఖర్‌బాబు నగరంలోని నవాబుపేట ప్రాంతంలో ఓ రైస్‌మిల్లును లీజుకు తీసుకుని, గతేడాది ఇదే సీజన్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 250 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. రైతులు, దళారులకు రూ.5.60 కోట్ల చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మలిచి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఏడాది కాలంగా ఆ రైతులకు, దళారులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నాడు. తమ ధాన్యం డబ్బులు ఇప్పించాలని రైతులు, దళారులు అధికారులు, పోలీసులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతల చుట్టూ తిరిగారు. రైతులు ఇటీవల జిల్లా స్థాయి అధికారిని సంప్రదించగా ‘మీ డబ్బులు ఇప్పించడానికి నేనేమైనా రౌడీనా.. గూండానా’.. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అంటూ సమాధానం చెప్పడంతో చివరకు మంత్రులు నారాయణ, ఆనంలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా.. ఫలితం కానరాకపోవడంతో మంగళవారం రైతులు రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు.
డబ్బులిప్పించండి.. సారూ
ఏడాది క్రితం శేఖర్‌బాబుకు ధాన్యం విక్రయించాం. పక్క మిల్లుల కంటే అధిక ధర ఇస్తానంటే ఆశతో ధాన్యం విక్రయించాం. డబ్బుల కోసం ఏడాది కాలంగా తిరుగుతున్నాం. స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. జిల్లా ఉన్నతాధికారులైనా రైతులపై దయ చూపి ధాన్యం నగదు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.
– పవన్‌రెడ్డి, రైతు, ఆత్మకూరు
అధికారులను సంప్రదించినా ఫలితం లేదు
రైతుల నుంచి ధాన్యం సేకరించి నవాబుపేటలోని శేఖర్‌బాబుకు విక్రయించాం. లోడుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు వస్తుందనే ఆశతో రైస్‌మిల్లర్‌కు ధాన్యం సరఫరా చేశాం. ధాన్యం నగదు కోసం గతేడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. న్యాయం జరిగేలా జిల్లా అధికారులైనా చర్యలు తీసుకోవాలి.
– నర్సింహనాయుడు, దళారి
ఆత్మకూరు ప్రాంతానికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే దళారీ రూ.22 లక్షల విలువ చేసే ధాన్యాన్ని శేఖర్‌బాబుకు విక్రయించారు. అందులో రూ.4 లక్షల నగదు ఇచ్చాడు. మిగిలిన నగదు కోసం సుధాకర్‌రెడ్డి అనేక పర్యాయాలు రైస్‌మిల్లర్ చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. రైతులు ఒత్తిడి చేయడంతో అనారోగ్యం పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌రెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం కనీసం రూ.20 వేలన్నా.. ఇవ్వాలంటూ ఆయన భార్య రైస్‌మిల్లర్‌ను ప్రాధేయపడింది. చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడంతో సుధాకర్‌రెడ్డి మెరుగైన వైద్యం చేయించుకోలేక మరణించాడు.
రైతుల నుంచి ఽమస్తాన్ అనే దళారీ దాన్యం సేకరించి శేఖర్‌బాబుకు విక్రయించారు. ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు మస్తాన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు.
శేఖర్‌బాబు గతంలో ఓ రైస్‌మిల్లులో గుమస్తాగా పనిచేసిన అనుభవంతో నవాబుపేట సమీపంలోని రైస్‌మిల్లును లీజుకు తీసుకున్నాడు. రైతులను, దళారులను అధిక ధర ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో రైతులు, దళారులు అధిక ధర వస్తుందని శేఖర్‌బాబుకు ధాన్యం విక్రయించారు. అటువంటి వారిలో ఓ రైతు దిగులతో అనారోగ్యానికి గురై మృతి చెందగా, మరో దళారీ జైలుపాలయ్యాడు.
ఆత్మకూరుకు చెందిన అనేక మంది రైతులు శేఖర్‌బాబుకు ధాన్యం విక్రయించారు. నగదు ఇవ్వకపోవడంతో రైతులు నగదు కోసం చేయని ప్రయత్నాలు లేవు. రైతులు దళారులతో కలిసి నగదు ఇవ్వాలంటూ పోలీసులను సంప్రదించారు. సీఐ వద్ద పంచాయితీ జరిగింది. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు రైతులకు న్యాయం చేయకుండా రైస్‌మిల్లర్ల వైపు నిలబడ్డారు. రైస్‌మిల్లర్లు ఇచ్చే ముడుపులు తీసుకుని కోట్ల రూపాయలు దిగమింగిన మిల్లర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ ఘటనలకు బాధ్యులెవరు?
ఈ ఘటనలకు బాధ్యులెవరు?
ఈ ఘటనలకు బాధ్యులెవరు?
ఈ ఘటనలకు బాధ్యులెవరు?
Comments
Please login to add a commentAdd a comment