ఆరోగ్యశ్రీలో డబ్బులు వసూలు చేస్తే భారీ జరిమానా
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(అర్బన్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్య సేవలు పొందుతున్న రోగుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు భారీగా జరిమానాలు విధిస్తామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ పలు ఆస్పత్రుల్లో రోజు వారీ తనిఖీలు నిర్వహిస్తుండగా రోగ నిర్ధారణ కోసం అదనంగా రోగుల నుంచి 12 ఆస్పత్రుల యాజమాన్యాలు డబ్బులు వసూలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్‌కు వివరించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ రమేష్‌నాథ్, వైద్యసేవాట్రస్ట్ జిల్లా మేనేజర్ వెంకటమురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment