● సచివాలయాల అడ్మిన్లపై
ఆర్‌ఐ దూషణలు
● అంతే దీటుగా బదులిచ్చిన అడ్మిన్లు
● రెవెన్యూ సమావేశం రసాభాస
నెల్లూరు(బారకాసు): ‘మీకు సిగ్గు, ఎగ్గు ఉందా.. మీ మొహానికి గ్రూపు–2 పరీక్ష అవసరమా.. పన్నుల వసూళ్లు సక్రమంగా చేయడం చేత కాదా’ అంటూ నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్లపై ఓ ఆర్‌ఐ అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన అడ్మిన్లు సైతం నీవెంత.. నీ అధికారమెంత.. అంటూ ఆర్‌ఐపై తిరగబడ్డారు. మరి కొంతమంది అడ్మిన్లు కూడా కలిసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం నీకెవరిచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారి గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు నెల్లూరు నగర కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం వేదికై ంది. నగరంలో పన్ను వసూళ్లపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం చివర్లో ఓ ఆర్‌ఐ సచివాలయాల్లోని పన్నులు వసూలు చేసే అడ్మిన్ కార్యదర్శులను ఉద్దేశించి ఇలా పలు విధాలుగా దుర్భాషలాడుతూ కించపరిచినట్లుగా మాట్లాడారు. ఇదంతా సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల సమక్షంలోనే జరిగింది. దీంతో వారు అందరికీ సర్దిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ వివాదం పన్ను విధించే క్రమంలో సంబంధిత భవన యజమానుల నుంచి అధిక మొత్తంలో తీసుకున్న లంచాల్లో వాటాల పంపకంలో తేడాలు వచ్చినందునే జరిగిందని కార్యాలయ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కమిషనర్ సూర్యతేజ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. జరిగిన గొడవపై ఆయన వచ్చాక ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment