ఆత్మకూరు: పట్టణంలోని డివిజన్ పోస్టాఫీసులో పోస్టల్ ఏజెంట్‌గా ఉన్న ఇమామ్ ఖాసీం తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమ ఖాతాల్లోని నగదును డ్రా చేశాడని, డిపాజిట్ చేయమని చెల్లించిన నగదును కాజేశాడని కొందరు వ్యక్తులు మంగళవారం పోలీసులు, పోస్టాఫీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన దగుమాటి నారాయణరెడ్డి, నారాయణమ్మ దంపతులు కొన్నేళ్లుగా పోస్టాఫీసులో సేవింగ్ ఖాతాల్లో డిపాజిట్ రూపంలో జమ చేస్తుండేవారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన పోస్టల్ ఏజెంట్ షేక్ ఇమామ్ ఖాసీం పరిచయం కావడంతో నాలుగైదేళ్లుగా అతని ద్వారానే నగదును డిపాజిట్ చేయించడం, అవసరమైనప్పుడు విత్‌డ్రా చేస్తుండేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుమార్తెలు, బంధువులైన పి సుజాత, కె స్వాతి, డి.స్వేత, డి రాజమ్మ ద్వారా కూడా పోస్టాఫీసులో ఇతని ద్వారానే ఖాతాలు తెరిపించి నగదు డిపాజిట్ చేస్తుండేవారు. ఇలా నమ్మకంగా వారి లావాదేవీలు నిర్వహిస్తున్న ఇమామ్ ఖాసీంకు వారం రోజుల క్రితం నారాయణమ్మ ఖాతా నుంచి నగదు తీసుకురావాలని సంతకం చేసి విత్ డ్రా ఫారం ఇచ్చారు. అయితే వారం గడిచినా నగదు తీసుకురాకపోవడంతో శనివారం గట్టిగా నిలదీశారు. తమ అల్లుడు సుధీర్‌రెడ్డి ద్వారా ఫోన్‌లో అడిగించారు. ఈ క్రమంలో సుధీర్‌రెడ్డి తన అత్త నారాయణమ్మను ఖాతా పాస్ పుస్తకాలు తీసుకెళ్లి పోస్టాఫీసులో విచారించగా ఇమామ్ వారం రోజుల క్రితమే ఆ నగదును తీసుకెళ్లినట్లు అధికారులు చెప్పడంతో మిగతా ఖాతాల పుస్తకాలను తెచ్చి చూశారు. నారాయణరెడ్డి ఖాతా లో రూ.13,08,800, నారాయణమ్మ ఖాతాలో రూ.12,66,000, డి రాజమ్మ ఖాతాలో రూ.3,27,800, డి స్వేత ఖాతాలో రూ.14000, కె స్వాతి ఖాతాలో రూ.43,595, పి సుజాతమ్మ ఖాతా లో రూ.87,000 ఇలా మొత్తం రూ.30,47,195 నగదు మాయమైందని గుర్తించి పోస్టల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోస్టల్ ఏజెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు
తనకేపాపం తెలియదంటున్న ఏజెంట్
లోతుగా విచారిస్తామన్న పోలీసులు
నేను ఏ పాపం ఎరుగను
తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని 32 ఏళ్లుగా పోస్టల్ ఏజెంట్‌గా పని చేస్తున్నానని ఏజెంట్ ఇమామ్ ఖాసీం తెలిపాడు. మూడు నెలల క్రితం నారాయణమ్మ కుటుంబీకులకు సంబంధించిన డిపాజిట్ బాండ్ మెచ్చ్యూర్ కావడంతో నగదును పోస్టాఫీసులో డ్రా చేయించి వారి వద్ద రూ.2.41 లక్షల నగదును అప్పుగా తీసుకుని, తన భార్యకు వైద్యం చేయించానన్నారు. తిరిగి రూ.80 వేలు ఫిబ్రవరిలో చెల్లించానని, ఇంకా రూ.1.61 లక్షలు అప్పు ఇవ్వాల్సి ఉందని తెలిపాడు. తనను ఆదివారం వారింటికి పిలిపించి బలవంతంగా ఖాళీ స్టాంప్‌లపై బాకీ ఉన్నానని సంతకాలు తీసుకున్నారని, కొన్ని ఖాళీ ప్రామిసరీ నోట్లపై కూడా సంతకాలు చేయించుకున్నారని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఇరువురు ఫిర్యాదులు చేశారని, పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని సీఐ, ఎస్సైలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment