నెల్లూరు (టౌన్): ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు బుధవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 75 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగానికి సంబంధించి 23,310 మంది విద్యార్థులకు 22,877 మంది హాజరయ్యారు. 433 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 986 మందికి 944 మంది హాజరు కాగా 42 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు, డీవీఈఓ 5, డీఈసీ 4, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు 24 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఓపెన్ స్కూల్ పరీక్షకు 279 మంది..
ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు బుధవారం మొత్తం 279 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 20 సెంటర్లలో జరిగిన పరీక్షకు 3,056 మంది విద్యార్థులకు 2,777 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు 4 సెంటర్లను తనిఖీ చేశారు.
పులుల గణన ప్రారంభం
● ఫారెస్ట్ రేంజర్ శేఖర్
ఆత్మకూరు: ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో పులుల గణన ప్రారంభించనున్నట్లు రేంజ్ అధికా రి శేఖర్ బుధవారం తెలిపారు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో ట్రీ, ట్రాప్ కెమెరాలు కొన్ని ఏర్పాటు చేశామని, అయితే పులుల గణనకు అవి సరిపోవన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్‌బాషా ఆదేశాలతో శ్రీశైలం ప్రాంతం నుంచి మరి న్ని కెమెరాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే అడవిలో పులులు సంచరించే ముఖ్య ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసి పులుల సంఖ్యను లెక్కించనున్నామన్నారు. ఈ ప్రక్రియ నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని తెలిపారు. పులుల సంరక్షణ కోసం అడవిలో పలు ప్రాంతాల్లో సిమెంట్ తొట్టెల ద్వారా తాగునీటి ఏర్పాట్లు చేశామన్నారు. ఎప్పటికప్పుడు వాటిలో క్షేత్ర స్థాయి సిబ్బంది నీరు నింపుతున్నట్లు తెలిపారు. అటవీ సమీప గ్రామాల్లో నివశిస్తున్న వారు జంతువుల సంరక్షణకు ఎలాంటి విఘాతం కలిగించరాదన్నారు. ఆయన వెంట డీఆర్‌ఓ పిచ్చిరెడ్డి ఉన్నారు.
రేపు టౌన్
ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ
నెల్లూరు (బారకాసు): గుంటూరు ప్రాంతీయ సంచాలకుల పట్టణ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 7న నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీలు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు నగర పంచాయతీల పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది, వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్‌టీపీలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రణాళిక విభాగం సిటి ప్లానర్ పద్మజ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఉదయం 10 గంటలకు జరగనున్న శిక్షణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన వివిధ మార్గదర్శకాలపై అవగాహన సదస్సు కల్పించనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి లైసెన్స్‌డ్ సివిల్ ఇంజినీర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ, మున్సిపల్, నగర పంచాయతీల కమిషనర్లు తమ పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించిన సిబ్బంది శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ సస్పెన్షన్
● మరో నలుగురికి షోకాజ్ నోటీసులు
నెల్లూరు(అర్బన్): అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో జిల్లాలోని హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ మధుసూదన్‌రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఎండీ రాజాబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్ ఇన్‌చార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజుతోపాటు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దయాకర్, ఏఈలు జమీర్, వెంకటేశ్వర్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్‌లో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్‌తోపాటు ఇసుకను కూడా అమ్ముకున్నట్లు రూఢీ అయింది. ఒక్క ఇసుక ద్వారానే రూ.34.45 లక్షలు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీంతో ఆ శాఖ ఎండీ రాజాబాబు ఈ మేరకు చర్యలు చేపట్టారు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment