
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు
నెల్లూరు (అర్బన్): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి కలెక్టర్ ధాన్యం కొనుగోళ్ల విషయంపై మాట్లాడారు. జిల్లాలో అన్ని రకాల ధాన్యాలు కలిపి 11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. ఇందులో ప్రధానంగా 5 లక్షల మెట్రిక్ టన్నులు బీపీటీ రకం దిగుబడి వస్తుందని లెక్కలు వేశామన్నారు. కనీసం 50 శాతం ధాన్యాన్ని రానున్న రెండు వారాల్లో కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కన్నా బయట ధర ఉంటే రైతులు అమ్ముకోవచ్చన్నారు. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు మిల్లర్లు కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. తేమ శాతం కొంచెం అటూ, ఇటూ ఉన్నా మిల్లర్లు కొనాల్సిందేనన్నారు. మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించి సూచనలు చేశామన్నారు. రైతులు, వ్యాపారులు నష్టపోకూడదనే ఉద్దేశంతో 105 రైసుమిల్లుల వద్ద ప్రభుత్వ అధికారులను అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే మిల్లర్లు రూ.20 కోట్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారని, రాబోయే నాలుగైదు రోజుల్లో మరో రూ.40 కోట్లకు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే లక్ష గన్నీ బ్యాగులు సిద్ధం చేశామన్నారు. మరో 3 రోజుల్లో పూర్తిస్థాయిలో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక వేళ రైతులే గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా సమకూర్చుకుంటే అందుకు సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ధాన్యం సేకరించిన 24 నుంచి 48 గంటల్లోపు నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. నెల్లూరు బీపీటీ ధాన్యానికి మంచి నాణ్యత ఉందన్నారు. అందువల్ల మిల్లర్లు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ రూపంలో బియ్యంగా సేకరించనున్నామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదన్నారు. ధాన్యం కొనాలంటే ముందుగా రైతులు వీఏఏను కలిసి తాము ఎప్పుడు వరి కోతలను ప్రారంభిస్తామో షెడ్యూల్ రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. ఈ ఒక్క పని చేస్తే ఇక అప్పటి నుంచి అధికారులు ధాన్యం సేకరణ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే వరకు పర్యవేక్షణ చేస్తారన్నారు. రైతు లు ధాన్యాన్ని అమ్ముకోకుండా నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఎంపీఎఫ్‌సీ, ఏపీఎంఎస్ ద్వారా గోడౌన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని తెలిపారు.
కనీస మద్దతు ధరకు కొనాల్సిందే
24 నుంచి 48 గంటల్లోపు రైతుల
ఖాతాల్లో నగదు జమ
కలెక్టర్ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment