కంచే చేను మేస్తోంది
ఉదయగిరి: వరికుంటపాడు మండలంలోని నక్కలగండి రిజర్వాయర్ కట్టపైన ఉన్న విలువైన వేప, తుమ్మ, చిల్లకర్రను అక్రమార్కులు నరికి స్వాహా చేస్తున్నారు. ఇరిగేషన్ పరిధిలో ఉండే ఈ రిజర్వాయర్‌లో గత 20 రోజుల నుంచి యథేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ శాఖలో పనిచేసే ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందనే విమర్శలున్నాయి. నక్కలగండి రిజర్వాయర్ ప్రధానమైన సాగునీటి వనరు. దీని కట్టకు ఇరువైపులా ఏళ్ల తరబడి రూ.లక్షల విలువచేసే వేప, తుమ్మ, చిల్లకర్ర పెద్దమొత్తంలో ఉంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఇరిగేషన్ శాఖలోని ఓ అధికారి సహకారంతో దోపిడీ మొదలుపెట్టారు. కట్ట దిగువ భాగంలో జేసీబీలు, ఇతర యంత్రాలు ఉపయోగించి వేళ్లతో సహా పెకిలించి కూలీలచేత సైజుల్లో ముక్కలుగా నరికించి వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.25 లక్షలకు పైగా విలువచేసే కలప సంపదను తరలించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మరో రూ.50 లక్షలు విలువైన కర్ర ఇంకా మిగిలిఉందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ అంకులయ్యను ప్రశ్నించగా తానే ఈ చెట్లు నరకమని చెప్పానని, దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం రూ.3 లక్షల నిధులు కేటాయించిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కలపను ఎలా నరికిస్తున్నారని ప్రశ్నించగా తగిన జవాబు రాలేదు. వింజమూరు ఇరిగేషన్ డీఈ రమణరావును ప్రశ్నించగా స్పందించిన ఆయన వరికుంటపాడు ఎస్సై రఘునాథ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ కలప లోడ్ చేసిన వాహనాలు ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోకుండా వదిలేసినట్లుగా సమాచారం.
నక్కలగండి రిజర్వాయర్‌లో
కలప అక్రమంగా నరికివేత
ఇరిగేషన్ అధికారి కనుసన్నల్లో
నిరాటంకంగా దోపిడీ
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
కంచే చేను మేస్తోంది
Comments
Please login to add a commentAdd a comment