నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు

Published Sun, Mar 9 2025 12:11 AM | Last Updated on Sun, Mar 9 2025 12:11 AM

నెల్ల

నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కరేడు నుంచి మనుబోలు వరకు సముద్ర తీరంలో ఆక్వా సాగు ఉంది. మొత్తం 33,104 ఎకరాల్లో ఆక్వా సాగు ఉండగా ఇందులో 22,104 ఎకరాల్లో రొయ్యలు, మిగిలిన ఎకరాల్లో చేపలు పెంచుతున్నారు. నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తికి కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ కొన్ని మార్గ దర్శకాలను రూపొందించింది. ఎంపెడా ద్వారా అనుమతి పొందిన హేచరీలకు బ్రూడర్స్‌ (తల్లి రొయ్యలు)ను సరఫరా చేస్తోంది. వీటి ద్వారా ఒక దఫాకు ఒక మిలియన్‌ సీడ్‌ ఉత్పత్తి అవుతోంది. ఒక బ్రూడర్‌తో 3, 4 సార్లు కంటే ఎక్కువ సార్లు గుడ్లు పెట్టించకూడదు. అంత కంటే ఎక్కువ సార్లు పెట్టిస్తే నాసిరకం పిల్లలు ఉత్పత్తవుతాయి. ఆరోగ్యంగా ఉన్న బ్రూడర్స్‌ నుంచి గుడ్లు పెట్టించి పొదిగించిన సీడ్‌ నాణ్యతగా ఉంటుంది. బ్రూడర్స్‌ నుంచి 1, 2, 3, 4 దఫాల్లో వచ్చిన రొయ్య పిల్లలు నాణ్యతతో పాటు పెరుగుదల ఒకే విధంగా ఉంటుంది. బ్రూడర్స్‌ ఎంపెడా నుంచి కొనుగోలు చేయడానికి రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో హేచరీల యజమానులు అత్యాశకు పోయి కొన్ని రకాల మందులను వినియోగించి 10 నుంచి 12 సార్లు కృత్రిమంగా గుడ్లు పెట్టించి పిల్లలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. మొదటి నాలుగు దశల్లో పొదిగించిన సీడ్‌తో 11, 12 దశల్లో వచ్చిన రొయ్య పిల్లలను కల్తీ చేసి రైతులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రైతుకు ఇచ్చిన రొయ్య పిల్లలు చెరువులో వదిలితే 50 శాతానికిపైగా చనిపోతున్నాయి.

జిల్లాలో 18 హేచరీలకే అనుమతి

జిల్లాలో 69 హేచరీలు ఉండగా వీటిలో 18 హేచరీలకే ఎంపెడా అనుమతి ఉంది. మిగతా హేచరీల్లో అనధికారికంగా సీడ్‌ ఉత్పత్తి చేస్తున్నారు. అనుమతి లేని హేచరీలకు ఎంపెడా బ్రూడర్స్‌ సరఫరా చేయకపోవడంతో వీరు సముద్రంలో దొరికే రొయ్యలను కొనుగోలు చేసి, వాటి ద్వారానే సీడ్‌ ఉత్పత్తి చేస్తున్నారని సమాచారం. ఇటువంటి హేచరీలు తాము చైన్నె నుంచి గుడ్లు తెచ్చి పొదిగించామని, నేచురల్‌ (ఎకో) సీడ్‌, హైజెనిక్‌ (పరిశుభ్రమైన) సీడ్‌ అని రైతులను నమ్మించి మోసం చేస్తున్నారు.

నష్టాల నుంచి బయటపడేందుకు..

ప్రతి పంటలో ఎదురవుతున్న పంట నష్టాల నుంచి బయట పడేందుకు రైతులు సామర్థ్యానికి మించి సీడ్‌ కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ఎకరా విస్తీర్ణానికి 30 వేల నుంచి 40 వేల వరకు రొయ్య పిల్లలను గుంతల్లో వదలవచ్చు. అయితే నకలీ సీడ్‌ కారణంగా సర్వైవల్‌ ఉండడం లేదని రైతులు రెండింతలకు పైగా అంటే సుమారు ఎకరాకు లక్షకు పైగా సీడ్‌ వదులుతున్న పరిస్థితి. ఆక్వా సాగు ప్రారంభంలో టైగర్‌ రొయ్యల సీడ్‌ను ఎకరాకు 15 వేల నుంచి 20 వేల వరకు వదిలేవారు. గుంతల్లో డెన్సిటీ తక్కువగా ఉండడంతో గ్రోత్‌ (కౌంట్‌ సైజ్‌) బాగా ఉండేది. రానురాను సీడ్‌ నాణ్యత తగ్గిపోవడంతో లక్షల్లో సీడ్‌ను వదిలి పెట్టేవారు. నకిలీ సీడ్‌ కారణంగా ఏకంగా రాష్ట్రంలోనే టైగర్‌ రొయ్యల సాగు పూర్తిగా కనుమరుగు అయిపోయింది. ఈ దశలో ఎంపెడా విదేశాల నుంచి వెనామీ తీసుకువచ్చింది. ప్రస్తుతం వెనామీ పరిస్థితి కూడా టైగర్‌ బాటలోనే కనుమరుగు దశకు చేరుకుంటోందని ఆక్వా నిపుణులు చెబుతున్నారు.

ఊపిరి తీస్తున్న ఫీడ్‌ కంపెనీలు, వ్యాపారులు

ఫీడ్‌ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిలువునా ముంచేయడంతో ఆక్వా రంగం జిల్లాలో కొన ఊపిరితో కునారిల్లుతోంది. వ్యాపారులే మార్కెటింగ్‌ ఏజెంట్లను పెట్టుకుని.. వీరే టెక్నీషియన్లు అని చెప్పి ఫీల్డ్‌లోకి పంపిస్తోంది. వీరికి కనీస పాటి అవగాహన కూడా ఉండడం లేదు. వీరు అవసరం లేకపోయినా.. గ్రోత్‌ కోసం, జీర్ణశక్తి మెరుగు పరిచేందుకు, బాక్టీరియా, అమోనియా లోడ్‌ కంట్రోల్‌, విటమినన్‌ సీ, మినరల్స్‌, మౌల్టింగ్‌ త్వరగా అయ్యేందుకు, ఆక్సిజనన్‌ వినియోగం పెరిగేందుకు అంటూ ఇలా రకరకాల పేర్లతో మందులు అంటగడుతున్నారు. ఆక్వా ఫీడ్‌ తయారీలో పేరెన్నికగన్న సంస్థలు కూడా సీజన్‌ను, డిమాండ్‌ను బట్టి నాసిరకం మేతలు సరఫరా చేస్తున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు. నాణ్యత లేని సీడ్‌, వాతావరణ మార్పుల కారణంగా ఎదుగుదల ఏ మాత్రం నెమ్మదించినా విపరీతంగా మందులు వాడుతున్నారు. చివరకు దుకాణాల్లో అప్పులు పెరిగి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితికి చేరుకుంటున్నారు.

కొందరు వ్యాపారులు నెల్లూరు, కోవూరు పరిసర ప్రాంతాల్లో అద్దె భవనాలు ఏర్పాటు చేసుకుని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చైన్నె వంటి ప్రాంతాల నుంచి సరుకులు (నాణ్యత లేనివి) తీసుకువచ్చి గోడౌన్లలో అందమైన కవర్లు, డబ్బాల్లో ప్యాక్‌ చేసి రైతులకు అంటగడుతున్నారు. తీరం వెంబడి ఆక్వా సాగు చేసే గ్రామాల్లోనే మేత, మందులు విక్రయించే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని సీడ్‌ దగ్గర నుంచి మేత, మందులు, జనరేటర్లు, డీజిల్‌ వరకు చిన్న రైతులకు అప్పుగా ఇస్తున్నారు. పంట పట్టుబడికి వచ్చిన తర్వాత వీళ్లే రొయ్యలు విక్రయించి తమ బాకీ జమ చేసుకుని మిగిలిన సొమ్ము రైతులకు ఇస్తున్నారు.

మత్స్యశాఖ చర్యలు తీసుకోవాలి

నకిలీ సీడ్‌ ఉత్పత్తి చేస్తూ మాయ మాటలతో అమ్మకాలు చేసే హేచరీలపై మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల పెంపకంలో ఎదుగుదల కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సీడ్‌, ఫీడ్‌, ఖర్చులకు వెచ్చించిన డబ్బు తిరిగి ఇప్పించాలి. ప్రభుత్వ అనుమతి లేని హేచరీలను మూయించి వేయాలి.

– కృష్ణప్రసాద్‌రెడ్డి, ఆక్వా రైతు, పోలంరాజుగుంట

తనిఖీలు చేస్తున్నాం

జిల్లా వ్యాప్తంగా హేచరీస్‌లో నకిలీ సీడ్స్‌పై విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. ముత్తుకూరు మండలంలోని రైతులు నష్టపోయారని తమ దృష్టికి వచ్చింది. విచారణ చేశాం. నకిలీ సీడ్‌పై తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం.

– నాగేశ్వరరావు,

మత్స్యశాఖ జేడీ, నెల్లూరు

నకిలీ సీడ్‌తో తీవ్ర నష్టాలు

వెనామీ రొయ్యల పెంపకంలో విపరీతంగా ఖర్చులు, కష్టాలు పెరిగాయి. వైరస్‌ వ్యాప్తి కూడా అధికంగా ఉంది. కొనుగోలు ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ సమస్యలతో సతమతమవుతుంటే ఎన్నడూ లేని విధంగా నకిలీ సీడ్‌ ఉత్పత్తి చేస్తూ కొన్ని హేచరీలు రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి.

– సన్నారెడ్డి మధురెడ్డి, ఆక్వా రైతు, గుడివాడతోపు

No comments yet. Be the first to comment!
Add a comment
నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు1
1/2

నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు

నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు2
2/2

నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement