
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత!
కందుకూరు రూరల్: కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు చూసి రాత పరీక్షలుగా మారాయి. శనివారం జరిగిన మ్యాథ్స్ 1–బీ పరీక్షకు సంబంధించిన చిట్టీలు, మైక్రో జెరాక్స్‌లు కళాశాల గేటు వద్ద, ప్రహరీ పక్కన కనిపించాయి. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి చిట్టీలు కనిపిస్తున్నాయి. ఒక సబ్జెక్ట్ చాప్టర్‌నే మైక్రో జిరాక్స్ తీయించి దారం కట్టి తెచ్చారు. ప్రశ్నపత్రం బయటకెళ్లాక మైక్రో జెరాక్స్‌లు వస్తున్నాయనేది అనుమానంగా ఉంది. కళాశాల కిటికీలు, ప్రహరీల పక్కన, గేటు వద్ద మైక్రో జెరాక్స్‌లు ఆ అనుమానాలను ధృవపరుస్తున్నాయి.
తనిఖీ అధికారులు ఏం చేస్తున్నట్లు?
మ్యాథ్స్, బోటని, జువాలజీ సబ్జెక్ట్‌లకు సంబంధించిన చిట్టీలు ఆ కళాశాల ప్రాంగణంలో బయట పడుతున్నాయి. పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చే ముందే గేటు వద్ద పోలీసులు, కళాశాల సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటే.. ఈ చిట్టీలు ఎలా వస్తున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీన్ని బట్టి విద్యార్థులు చిట్టీలతో వెళ్తున్నా పట్టించుకోవడం లేదనుకోవాలి. లేదా పరీక్ష ప్రారంభం అయిన తర్వాత పేపర్ బయటకు వెళ్లి.. ఆన్సర్లు మైక్రో జెరాక్స్‌ల రూపంలో అయినా వస్తుండాలి. పరీక్ష కేంద్రంలో చిట్టీలు పెట్టి రాస్తుంటే పరీక్ష కేంద్రం చీఫ్, డిపార్ట్‌మెంట్ అధికారి ఏం చేస్తున్నారని మరికొందరు విద్యార్థులు నిల దీస్తున్నారు. దీనిపై ఆర్‌ఐఓ శ్రీనివాసులను వివరణ కోరగా ఈ పరీక్ష కేంద్రంపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశాం. రేపటి నుంచి ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటాం. చిట్టీలు జరుగుతున్నాయంటే చర్యలు తప్పక తీసుకుంటాం.
ఇంటర్ పరీక్షల ప్రారంభం నుంచి
అదే తంతు
పరీక్ష కేంద్రం వద్ద కుప్పలు కుప్పలుగా మైక్రో జెరాక్స్ చిట్టీలు
మొక్కుబడిగా తనిఖీలు..
చూసీచూడని వైఖరి
Comments
Please login to add a commentAdd a comment