
ధీమానా?.. ధిక్కారమా!
● ప్రభుత్వ ఆదేశాలు..
చిత్తు కాగితాలతో సమానం
● మైపాడు రోడ్డు పనులు రద్దు చేసినా.. కొనసాగిస్తున్న కాంట్రాక్టర్
● 5 శాతం ఎక్సెస్‌తో టెండర్
దక్కించుకున్న కాంట్రాక్టర్
● షాడో ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చుకుని యథేచ్ఛగా పనులు
● అనుమతి లేకుండా పనులు
జరుగుతున్నా అధికారులు మౌనం
● అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకంగా నిర్మాణం
జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ ఉంటే ప్రభుత్వ ఉత్తర్వులు సైతం చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకే దిక్కు లేకుండా పోవడం చూసి అధికార యంత్రాంగమే విస్తుపోతోంది. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులు 25 శాతం
పూర్తి కాని వాటిని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నెల్లూరు– మైపాడు రహదారికీ వర్తిస్తాయి. సదరు కాంట్రాక్టర్ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ఎంచక్కా రోడ్డు వర్క్ చేస్తున్నాడు. షాడో
ఎమ్మెల్యేలకు ముడుపులు ఇవ్వడంతో అధికార యంత్రాంగం కాంట్రాక్టర్ ముందు మోకరిల్లింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు– మైపాడు రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రద్దయిన పనులను ఎంచక్కా కానిచ్చేస్తున్నాడు. గతంలో ఆ వర్కుకు టెండర్లు వేసిన సమయంలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి ముగ్గురు కలిసి 5 శాతం ఎక్సెస్ ధరకు పనులు దక్కించుకున్నారు. రూ.48 కోట్ల (సీఆర్‌ఐఎఫ్) నిధులతో నెల్లూరు – మైపాడు రోడ్డును అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రభుత్వం మారడంతో ఆ వర్క్ నెల్లూరు డివిజన్ పరిధిలో జరుగుతున్నా.. కోవూరు డివిజన్ పరిధిలోకి మార్పు చేసుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం 25 శాతం కంటే తక్కువ పని చేసిన వర్క్‌లను రద్దు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చే సరికి దాదాపు 10 శాతం కూడా ఆ రోడ్డు పని పూర్తి కాలేదు. రద్దయిన పనుల జాబితాలోకి ఆ పని కూడా వచ్చింది. కానీ సదరు కాంట్రాక్టర్ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా రాజకీయ ఒత్తిడి తెచ్చి రద్దయిన పనిని కూడా చేస్తున్నాడు.
షాడో ఎమ్మెల్యే పాత్ర కీలకం
మైపాడు రోడ్డు అభివృద్ధి పనులు గతంలో చేపట్టిన సిండికేట్‌లోని ముగ్గురిలో ఒకరు మిగతా ఇద్దరు కాంట్రాక్టర్ల వద్ద ఎక్సెస్ ధర మేర ముడుపులు తీసుకుని రద్దయిన పనిని పూర్తి చేయించేలా కోవూరు షాడో ఎమ్మెల్యేతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పరిధిలోకి వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఆ శాఖ మంత్రికి చెప్పించుకుని రోడ్డు పనిని అనధికారికంగా పూర్తి చేయిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వ ఉత్తర్వులకే దిక్కులేకపోవడంతో మిగిలిన కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు.
అడ్డదారుల్లోనైనా..
నెల్లూరు–మైపాడు రోడ్డు 10 శాతం పనులు మేర జరిగిన నేపథ్యంలో రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో.. అనధికారికంగా మరో 15 శాతం పనులు పూర్తి చేస్తున్నారు. 10 శాతం పనుల జాబితాలో ఈ రోడ్డు ఉండడంతో.. అడ్డదారుల్లో వెళ్లి ఆ పనిని ఆ జాబితా నుంచి తప్పించారని సమాచారం. ఇటీవల జిల్లాకు వచ్చిన సదరు శాఖ మంత్రిని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఆ పని రద్దు కాకుండా పనులు సజావుగా జరిగేలా చూడాలని కోరినట్లు తెలిసింది. అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో 25 శాతం పనులు జరిగినట్లు ధ్రువీకరించి కోర్టు ద్వారా అయినా కాంట్రాక్ట్‌ను చేజార్చుకోకుండా చూసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
నాణ్యతకు నీళ్లు
మైపాడ్ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతకు నీళ్లోదిరారు. సంబంధిత శాఖ ఇంజినీర్లు రద్దయిన రోడ్డు నిర్మాణ పనుల జోలికి వెళ్లకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డు మార్జిన్‌లో ఉన్న గ్రావెల్‌ను రియల్ వెంచర్లకు తోలి రూ.కోట్లు కొల్లగొట్టారు. పనులు కూడా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం మైపాడు రోడ్డు పనులు రద్దయింది వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉండడంతో తామేమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు. రోడ్డు పనులు ఆపే శక్తి తమకు లేదని అధికారులు చెప్పడం చూస్తుంటే కాంట్రాక్టర్ పవర్ ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment