
యువతకు అండగా వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట
● 12న ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా
● ‘యువత పోరు’ పోస్టర్ ఆవిష్కరణలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా, ఉద్యోగావకాశాలు కల్పించకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులను చదువులకు దూరం చేయడంతోపాటు నిరుద్యోగులను దగా చేస్తోందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అందుకు నిరసనగా ఈ నెల 12న విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి పోరుబాట చేపడుతున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’కు సంబంధించిన పోస్టర్‌ను పలు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, విద్యార్థి సంఘ నాయకులు, పార్టీ నాయకులతో కలిసి ఆదివారం కాకాణి నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. కాకాణి మాట్లాడుతూ చంద్రబాబు అన్ని రంగాల వారిని మోసం చేసినట్లుగానే విద్యార్థులను, యువతను కూడా మోసం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలన్న ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనసాగించారన్నారు. చంద్రబాబు నాడు–నేడు ఈ పథకాలను నీరు గార్చారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, లేకపోతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచి నిధులు విడుదల చేయించే విధంగా పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ నడుం బిగించిందన్నారు. ఈ నెల 12న నిర్వహించే యువత పోరుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. వైస్సార్‌సీపీ వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, నాయకులు వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment